బావా బామ్మర్ది రిలేషన్‌తో.. అనిల్ రావిపూడి మ్యాజిక్?

ABN , Publish Date - Jun 17 , 2026 | 10:56 AM

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్‌పై ఆసక్తికర అప్‌డేట్ వైరల్ అవుతోంది.

Anil Ravipudi

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆయన దర్శకత్వంలో సినిమా వస్తోందంటే చాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవడం ఖాయమనే నమ్మకం ప్రేక్షకుల్లోనూ, ఇండస్ట్రీలోనూ ఏర్పడింది. అందుకు తగ్గట్టుగానే ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా ఆయన తెరకెక్కించిన 'మన శంకర వరప్రసాద్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 400 కోట్ల కలెక్షన్లను రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ భారీ విజయంతో మరింత ఉత్సాహంతో ఉన్న అనిల్ రావిపూడి, తన తదుపరి ప్రాజెక్ట్‌గా విక్టరీ వెంకటేశ్, నందమూరి కళ్యాణ్ రామ్‌లతో ఒక క్రేజీ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు.

ఈ మల్టీస్టారర్ కాంబినేషన్‌పై ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిల్ రావిపూడికి దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చి 'పటాస్' వంటి సూపర్‌హిట్‌ అందించిన హీరో కళ్యాణ్ రామ్ కాగా.. 'ఎఫ్ 2', 'ఎఫ్ 3', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలతో అనిల్‌కు ఎంతో లక్కీ హీరోగా మారిన విక్టరీ వెంకటేష్ కూడా ఇందులో భాగం కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై క్రేజ్ ఆకాశాన్ని తాకింది. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ సైతం ఇప్పటికే పూర్తి కాగా, త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో వెంకటేష్ (Venkatesh), కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ఇద్దరూ బావ-బామ్మర్దులుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య సాగే సరికొత్త రిలేషన్ షిప్ బాండ్, ఒకరినొకరు కౌంటర్ వేసుకునే సీన్లు ఈ సినిమాకే ప్రధాన హైలైట్‌గా నిలవబోతున్నాయట. వెంకటేష్ మార్క్ ఫ్యామిలీ కామెడీ టైమింగ్, కళ్యాణ్ రామ్ ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ కలబోసి ఆడియన్స్‌కు థియేటర్లలో డబుల్ డోస్ వినోదాన్ని అందించడానికి మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy Suresh), కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలుస్తుండగా.. జీవీ ప్రకాష్ (G. V. Prakash Kumar) సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సాధారణంగా అనిల్ రావిపూడి సినిమాల్లో కామెడీకి చాలా పెద్ద పీట వేస్తుంటారు. ఆయన గత చిత్రాల తరహాలోనే ఈ మల్టీస్టారర్ మూవీని సైతం అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దనున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్, క్లాస్ ప్రేక్షకులను అలరించే అన్ని హంగులు ఈ కథలో ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్న ఈ క్రేజీ అప్‌డేట్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. మరి ఈ క్రేజీ మల్టీస్టారర్‌తో అనిల్ రావిపూడి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలంటే సినిమా విడుదల వరకు ఎదురుచూడక తప్పదు!.

Updated Date - Jun 17 , 2026 | 10:56 AM