Anil Ravipudi: బాస్ సినిమా ట్రైల‌ర్ రిలీజ్‌.. స్టేజ్‌పై స్టెప్పులేసిన అనిల్ రావిపూడి

ABN , Publish Date - Jan 05 , 2026 | 06:40 AM

చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్‌ గారు చిత్రం ట్రైల‌ర్ ఆదివారం తిరుప‌తిలో రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ అనిల్‌ రావిపూడి మాట‌లు, స్టెప్పుల‌తో అల‌రించారు.

Anil Ravipudi

‘ఒక సగటు అభిమానిగా చిరంజీవిలో నాకు ఏం నచ్చుతాయో.. అలాంటి అంశాలతోనే ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ (Mana Shankara Vara Prasad Garu) కథను సిద్ధం చేశా. ఇది కేవలం ట్రైలర్‌ మాత్రమే. థియేటర్లలో రెండున్నర గంటలపాటూ నాన్‌స్టాప్‌ వినోదాన్ని చూస్తారు’ అని దర్శకుడు అనిల్‌ రావిపూడి (anil ravipudi) అన్నారు. ఆయన దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. సంక్రాంతి సందర్భంగా ఈనెల 12న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా ఆదివారం తిరుపతిలో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ మెగా రైడ్‌లా ఉంటుంది. టైమ్‌ మెషీన్‌లో ఒక రౌండ్‌ వేసి వింటేజ్‌ చిరంజీవిని చూస్తారు. ఇందులో ఆయన టైమింగ్‌, ఎనర్జీ మనకు బాగా నచ్చేస్తాయి. అభిమానులు ఆయనను ఎలా చూడాలనుకుంటున్నారో దృష్టిలో పెట్టుకునే శంకర వరప్రసాద్‌ పాత్ర రాశా. ఆయన తన నటనతో ఆ పాత్ర స్థాయిని మరో 100 రెట్లు పెంచేశారు. ఈ సినిమా చూశాక ప్రతి అభిమాని ఆనందంతో థియేటర్‌లోంచి బయటకు వస్తాడు. మన తరం వాళ్లంతా చిరంజీవి, వెంకటేశ్‌ను ఒకే ఫ్రేమ్‌లో చూడాలనుకున్నాం. మొత్తానికి ఈ చిత్రంతో అది నెరవేరింది’ అని చెప్పారు.

ఈ సినిమా సంక్రాంతికి బాక్సాఫీసును షేక్‌ చేస్తుంది’ అని సాహు గారపాటి తెలిపారు. ‘ఈ చిత్రం మెగాస్టార్‌ చేసే ప్యూర్‌ మ్యాజిక్‌’ అని సుష్మిత కొణిదెల పేర్కొన్నారు. ఇందులో చిరు లుక్స్‌, ఆయన చేసిన కామెడీ, యాక్షన్‌.. పలికిన సంభాషణలు అదిరిపోయాయి. వెంకీ కామియో అలరించింది. చివ‌ర‌లో అనీల్ రావిపూడి సినిమాలోని చిరంజీవి, వెంకీ పాట స్టెప్పును స్టేజీపై వేసా అల‌రించారు. ఇదిలాఉంటే.. గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్టైన్‌మెంట్స్‌, షైన్ స్క్రీన్స్ బ్యానర్లపై చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల, సాహు గారపాటి సంయుక్తంగా నిర్మించారు. నయనతార కథానాయిక. కేథరిన్‌ ట్రెసా, అభినవ్‌ గోమఠం, హ‌ర్ష వ‌ర్ధ‌న్‌, వీటీవీ గణేశ్‌ కీలక పాత్రలు పోషించారు.

Updated Date - Jan 05 , 2026 | 06:40 AM