అనిల్ రావిపూడి, రామ్ మూవీ! ఆ సెంటిమెంట్‌కు బ్రేక్?

ABN , Publish Date - May 29 , 2026 | 06:12 AM

టాలీవుడ్‌లో ఒక క్రేజీ కాంబినేషన్ గురించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

anil ravipudi

టాలీవుడ్‌లో ఒక క్రేజీ కాంబినేషన్ గురించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి (Anil Ravipudi), ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) కలయికలో ఒక భారీ సినిమా రూపుదిద్దుకోబోతోందనే టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది. నిజానికి ఈ ఇద్దరి కాంబో ఎప్పుడో సెట్ కావాల్సింది.

గతంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘రాజా ది గ్రేట్’ కథను అనిల్ రావిపూడి మొదట రామ్‌కే వినిపించారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఆ సినిమా వచ్చి దాదాపు పదేళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా వినిపిస్తున్న లీకులు ఇండస్ట్రీలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

సాధారణంగా అనిల్ రావిపూడి సినిమా అంటే సంక్రాంతి సీజన్‌కు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. పండగ బరిలో దిగి వరుసగా బాక్సాఫీస్ హిట్లు కొట్టడం ఆయనకు అలవాటుగా మారింది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం అనిల్ రావిపూడి తన రెగ్యులర్ సంక్రాంతి సెంటిమెంట్‌ను పక్కన పెట్టబోతున్నట్లు సమాచారం.

రామ్, అనిల్ రావిపూడి కాంబోలో రాబోయే సినిమాను ఏకంగా 2027 దసరా కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ఓకే అయిందా లేదా అనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. అయినప్పటికీ, కొందరు సోషల్ మీడియా విశ్లేషకులు ఏకంగా విడుదల తేదీలను కూడా ప్రకటించేస్తుండటం గమనార్హం.

ఈ పుకార్లు ఎలా ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఈ కాంబినేషన్ సెట్ అవ్వడానికి చాలా సమయం పట్టేలా కనిపిస్తోంది. ఎందుకంటే హీరో రామ్ పోతినేని ప్రస్తుతం తన కెరీర్‌లో సరికొత్త అడుగు వేశారు. ఆయన కేవలం హీరోగానే కాకుండా, మెగాఫోన్ పట్టి దర్శకుడిగా కూడా మారుతున్నారు. రామ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.

దీంతో ఆయన పూర్తిగా ఆ సినిమా పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అటు దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ప్రస్తుతం ఒక భారీ మల్టీస్టారర్ చిత్రంతో బిజీగా గడుపుతున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలయికలో ఆయన రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీనితో పాటు ఒక యానిమేషన్ ప్రాజెక్ట్ చేసే ఆలోచనలో కూడా అనిల్ ఉన్నట్లు సమాచారం.

ఈ ఇద్దరి ప్రస్తుత కమిట్‌మెంట్స్ చూస్తుంటే, ఈ ప్రాజెక్ట్ త్వరలోనే ప్రారంభమవుతుందని ఆశించడం కాస్త అత్యాశే అవుతుంది. ఒకవేళ ఇవన్నీ అనుకున్నట్లు జరిగి, 2027 సంక్రాంతి సమయానికి రామ్ తన దర్శకత్వ బాధ్యతల నుండి ఫ్రీ అయితే.. అప్పుడు అనిల్ రావిపూడితో సినిమా పట్టాలెక్కే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

అప్పటివరకు ఈ కాంబో గురించి వస్తున్న వార్తలన్నీ కేవలం ప్రచారానికే పరిమితం కానున్నాయి. భవిష్యత్తులో సమీకరణాలు ఎలా మారతాయో, ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

Updated Date - May 29 , 2026 | 02:12 PM