అనిల్ రావిపూడిని వణికించిన బాలయ్య సినిమా..

ABN , Publish Date - Apr 07 , 2026 | 11:03 AM

టాలీవుడ్‌లో తిరుగులేని సక్సెస్ రేటు ఉన్న దర్శకుడు ఎవరంటే అందరూ చెప్పే పేరు అనిల్ రావిపూడి. పటాస్‌తో మొదలైన ఈయన ప్రయాణం నేడు బాక్సాఫీస్ దగ్గర వందల కోట్ల వర్షం కురిపించే స్థాయికి చేరింది.

టాలీవుడ్‌లో తిరుగులేని సక్సెస్ రేటు ఉన్న దర్శకుడు ఎవరంటే అందరూ చెప్పే పేరు అనిల్ రావిపూడి (Anil Ravipudi). పటాస్‌తో మొదలైన ఈయన ప్రయాణం నేడు బాక్సాఫీస్ దగ్గర వందల కోట్ల వర్షం కురిపించే స్థాయికి చేరింది. అయితే ఈ ప్రయాణం పైకి కనిపించినంత సాఫీగా ఏమీ సాగలేదు. ముఖ్యంగా అనిల్ రావిపూడి కెరీర్‌లో కొన్ని సినిమాలు ఆయన్ను తీవ్రమైన ఒత్తిడికి గురి చేశాయట. తన కెరీర్‌లో వరుసగా 300 కోట్ల కలెక్షన్లు రాబట్టినా.. ఆయన్ను రెండు సినిమాలు మాత్రం ముప్పు తిప్పలు పెట్టాయట.

అనిల్ రావిపూడి అంటే మనందరికీ గుర్తొచ్చేది నాన్-స్టాప్ కామెడీ. కానీ ఈ మధ్య కాలంలో ఆయన తన రూటు మార్చి బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా ఆయన చివరి రెండు సినిమాలు సంక్రాంతికి వస్తున్నాం, మన శంకరవరప్రసాద్ గారు టాలీవుడ్‌ను ఊపేశాయి. రీజనల్‌ పరంగా ఈ రెండు చిత్రాలు 300 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను సాధించి అనిల్‌ రావిపూడిని టాప్‌ ప్లేస్‌కు తీసుకెళ్లాయి. ముఖ్యంగా మన శంకరవరప్రసాద్ గారు  చిత్రంతో అనిల్ రావిపూడి రేంజ్ మారిపోయింది. మెగాస్టార్‌ని డైరెక్ట్ చేయడం, అది కూడా ఫ్యాన్స్ ఆశించే ఎలిమెంట్స్‌తో పాటు తన మార్క్ కామెడీని మిక్స్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఈ భారీ విజయాలతో అనిల్ ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ల లిస్టులో టాప్‌లో ఉన్నారు. అయితే ఇంతటి భారీ సక్సెస్ చూస్తున్న అనిల్‌ను రెండు  సినిమాలు మాత్రం బాగా ఇబ్బంది పెట్టాయట. రీసెంట్‌గా ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో అనిల్ తన మనసులో మాటను బయటపెట్టారు. కెరీర్ ఆరంభం నుండి కామెడీని ప్రధానాస్త్రంగా చేసుకున్న అనిల్.. మొదటిసారి సరిలేరు నీకెవ్వరు సినిమాతో కొంచెం సీరియస్ పంథాలోకి వెళ్లారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇమేజ్‌ను బ్యాలెన్స్ చేస్తూనే.. దేశభక్తి అంశాన్ని కామెడీతో కలిపి ప్రెజెంట్ చేయడం అనేది తనకు ఒక పెద్ద సవాల్ గా మారిందని ఆయన పేర్కొన్నారు.

కానీ అనిల్‌ను అన్నిటికంటే ఎక్కువగా టెన్షన్ పెట్టిన సినిమా మాత్రం నందమూరి బాలకృష్ణతో చేసిన 'భగవంత్ కేసరి'. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో అనిల్ చాలా మథనపడ్డారట. ఎందుకంటే ఇందులో ఫన్ చాలా తక్కువ.. ఎమోషనల్ డ్రామా, సోషల్ మెసేజ్ చాలా ఎక్కువ. బాలయ్య లాంటి మాస్ కటౌట్‌ను పెట్టుకొని.. విలన్ కాన్‌ఫ్లిక్ట్, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్, ఆడపిల్లల ఆత్మగౌరవం వంటి వెయిట్ ఉన్న కథను చెప్పడం అనేది దర్శకుడిగా ఆయనకు కత్తి మీద సాములా అనిపించిందట. అనిల్ రావిపూడి సినిమా అంటే నవ్వులే నవ్వులు అని థియేటర్‌కు వచ్చే ఆడియన్స్.. ఈ సీరియస్ డ్రామాను ఎలా రిసీవ్ చేసుకుంటారు..? అనే సందేహం ఆయన్ను షూటింగ్ సమయంలో వెంటాడిందట. చివరికి అనిల్ రావిపూడి విజన్ ఫలించింది. భగవంత్ కేసరి బాక్సాఫీస్ హిట్ అవ్వడమే కాకుండా.. జాతీయ స్థాయిలో ఆయనకు ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఆ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తోనే ఆయన సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలతో 300 కోట్ల మార్కును సునాయాసంగా దాటగలిగారు. వరుసగా విజయాలు అందుకుంటున్నా.. ప్రతి సినిమాకు కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటూ, రిస్క్ చేయడానికి వెనుకాడకపోవడమే అనిల్ రావిపూడి సక్సెస్ సీక్రెట్. దర్శకుడిగా తనకున్న కామెడీ ముద్రను చెరిపేసుకుని.. అన్ని రకాల ఎమోషన్లను పండించ గలనని ఆయన నిరూపించారు.

Updated Date - Apr 07 , 2026 | 11:25 AM