Anil Ravipudi: గోడ మీద గిరక.. మీకెప్పటికీ నేను దొరకా
ABN , Publish Date - Jan 12 , 2026 | 05:31 PM
అనిల్ రావిపూడి (Anil Ravipudi).. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. కథ లేకపోయినా ఒక సినిమా హిట్ అయితే అది లక్ వలన హిట్ అయ్యింది అంటారు.
Anil Ravipudi: అనిల్ రావిపూడి (Anil Ravipudi).. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. కథ లేకపోయినా ఒక సినిమా హిట్ అయితే అది లక్ వలన హిట్ అయ్యింది అంటారు. కానీ, అనిల్ రావిపూడి ప్రతిసారి కథ లేకపోయినా హిట్ అవుతూనే వస్తున్నాడు. ఈసారి దొరుకుతాడు.. ఈసారి దొరుకుతాడు అంటూ కొంతమంది అనిల్ ప్లాప్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తో మన శంకరవరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu) తెరకెక్కించిన అనిల్ కి కచ్చితంగా ప్లాప్ పడుతుంది.. ఈసారి దొరికేసినట్టే అని అందరూ అనుకున్నారు. కానీ, కుర్ర డైరెక్టర్ ఈసారి కూడా దొరకలేదు.
మన శంకరవరప్రసాద్ గారు జనవరి 12 న రిలీజ్ అయ్యి సంక్రాంతి హిట్ అందుకుంది. మొదటి నుంచి అనిల్ సినిమాలు అంటే క్రింజ్ కామెడీ ఉంటుంది. రొట్ట కథలు.. లాజిక్స్ ఉండవు అని టాక్. ఎఫ్ 2, ఎఫ్ 3 అయితే అస్సలు చూడలేం బాబోయ్ అని కొందరు చెప్పుకొచ్చారు. ఏదో లక్ కొద్దీ అవన్నీ హిట్ అవుతున్నాయని కొందరు.. ఫ్యామిలీ ఆడియెన్స్ కి నచ్చుతున్నాయి అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు చిరు సినిమానే తీసుకుంటే.. ఇందులో కూడా కథ లేదు.. కామెడీ ఉన్నా అవి కొంతవరకు మాత్రమే. కానీ, హిట్ మాత్రం వచ్చింది.
మన శంకరవరప్రసాద్ గారు కథ కూడా విశ్వాసం, తులసి సినిమాలను గుర్తుచేస్తుంది. వెంకీ, చిరు కామెడీ సీన్స్ కొద్దిగా పర్వాలేదనిపించినా ఇంకాస్త ఉంటే బావుండేది అనే ఫీల్. మధ్య మధ్యలో అనవసరమైన సీన్స్.. ఇలా నెగిటివ్స్ ఉన్నా కూడా అనిల్ స్క్రీన్ ప్లే తో రఫ్ఫాడించేశాడు. చిరును ఎలా చూపించాలో అలా చూపించాడు. అనిల్ కి తెలిసిందల్లా ఒక్కటే. టికెట్ కొని లోపలికి వచ్చినవాడు కొద్దిసేపు నవ్వుకోవాలి. లాజిక్స్ ఉన్నాయా.. లేదా అనేది సెకండరీ. ఆ ఫార్ములానే ఫ్యామిలీ ఆడియెన్స్ ని థియేటర్ కి రప్పిస్తుంది. అందుకే వరుస సినిమాలతో విజయాలను అందుకుంటున్నాడు. ఇక మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో అర్థమైంది ఏంటి అంటే.. కథ లేకపోయినా స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను కూర్చోబెట్టగల సత్తా ఉన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. అందుకే గోడ మీద గిరక.. అనిల్ రావిపూడి ఎప్పటికీ దొరకా అని పదాన్ని సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రెండ్ చేస్తున్నారు.