బాలయ్యకి విలన్ గా యాంగ్రీ మ్యాన్..
ABN , Publish Date - Oct 04 , 2026 | 04:46 PM
దేవర బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు కొరటాల శివ చాలా గ్యాప్ తీసుకున్న సంగతి తెల్సిందే. గ్యాప్ తీసుకున్నా దేవర 2 తో వస్తాడు అనుకుంటే.. మ్యాన్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణతో సినిమా ప్రకటించి షాక్ ఇచ్చాడు.
దేవర బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు కొరటాల శివ చాలా గ్యాప్ తీసుకున్న సంగతి తెల్సిందే. గ్యాప్ తీసుకున్నా దేవర 2 తో వస్తాడు అనుకుంటే.. మ్యాన్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణతో సినిమా ప్రకటించి షాక్ ఇచ్చాడు. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన వార్తలు ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈసారి కొరటాల.. బాలయ్య గట్టిగా ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా కోసం బాలీవుడ్ మొత్తాన్ని కొరటాల రంగంలోకి దింపుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై ఒక మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్ ఫిలింనగర్ సర్కిల్స్‌లో విపరీతంగా హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్ ఒక పవర్‌ఫుల్, భయంకరమైన విలన్ పాత్రలో కనిపించబోతున్నారని గట్టిగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే విలక్షణ పాత్రలతో మెప్పించిన రాజశేఖర్, ఈ సినిమాలో బాలయ్యకు ధీటైన సరికొత్త విలనిజంతో ప్రేక్షక లోకాన్ని భయపెట్టబోతున్నాడట. రాజశేఖర్ ఈ ఏడాది బైకర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా తరువాత వరుస అవకాశాలు ఆయన తలుపు తడుతున్నాయి. బాలయ్యతో ఢీ అంటే మామూలు విషయం కాదు. ఈ పాత్ర కనుక క్లిక్ అయితే స్టార్ విలన్ గా మారే ఛాన్స్లు ఎక్కువగానే ఉన్నాయి. అందుకే రాజశేఖర్ సైతం ఓకే చెప్పినట్లు టాక్.
ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారని సమాచారం. తండ్రి, కొడుకు పాత్రల్లో బాలకృష్ణ సందడి చేయబోతున్నాడని అంటున్నారు. కొరటాల శివ ఈసారి ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు పవర్-ప్యాక్డ్ మాస్ ఎలిమెంట్స్ కలగలిపి కథను అత్యంత ప్రత్యేకంగా తీర్చిదిద్దారని తెలుస్తోంది. ఈ చిత్రం కోసం బాలయ్య పూర్తిగా సరికొత్త మేకోవర్‌లోకి మారనున్నాడని, దానికి సంబంధించిన వర్క్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోందని టాక్. ఈ హై-వోల్టేజ్ ప్రాజెక్ట్ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ డిసెంబర్ మొదటి వారం నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది. కొరటాల టేకింగ్, బాలయ్య మాస్ ఇమేజ్, రాజశేఖర్ విలనిజం కాంబినేషన్ సెట్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరి ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి రికార్డులు తిరిగి రాస్తాడో చూడాలి.