NBK: ఏఐజీ ఆస్పత్రిలో బాలయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jul 26 , 2026 | 05:30 PM
హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలకృష్ణను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు.
ఇటీవల షూటింగ్ లో గాయపడిన నందమూరి బాలకృష్ణ హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన్ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. బాలయ్య ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆయన అడిగి తెలుసుకున్నారు. జులై 21న కాకినాడ పోర్టులో 'ఎన్‌బీకే 111' సినిమా షూటింగ్ జరుగుతుండగా యాక్షన్ సన్నివేశంలో బాలకృష్ణకు గాయం అయింది. ప్రమాదంలో ఎడమ మోకాలి చుట్టూ ఉన్న కణజాలాల్లో రక్తస్రావం జరగడంతో వాపు ఏర్పడింది. అనంతరం ఆయనను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
బాలయ్య గాయపడిన వార్త తెలిసినప్పటి నుంచి అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆయన త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. సినీ ప్రముఖులు కూడా బాలయ్య ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేస్తున్నారు. వైద్యుల సూచనల మేరకు బాలకృష్ణ మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడిన తర్వాత ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశముందని సమాచారం.