Rashmi Gautham: దేవుడా.. ఒక పెద్ద విపత్తుని పంపించు.. నా కుటుంబం చచ్చినా పర్లేదు
ABN , Publish Date - Nov 18 , 2026 | 08:04 PM
బుల్లితెర స్టార్ యాంకర్, నటి రష్మీ గౌతమ్ (Rashmi Gautam) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె కెరీర్ గురించి పక్కన పెడితే జంతు ప్రేమికురాలిగా, మూగజీవాలపై జరిగే దాడులపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఎండగడుతూ ఉంటుంది.
బుల్లితెర స్టార్ యాంకర్, నటి రష్మీ గౌతమ్ (Rashmi Gautam) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె కెరీర్ గురించి పక్కన పెడితే జంతు ప్రేమికురాలిగా, మూగజీవాలపై జరిగే దాడులపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఎండగడుతూ ఉంటుంది. మూగ జీవాలను ఎవరైనా హింసిస్తే మాత్రం అస్సలు తట్టుకోలేదు. తాజాగా మరోసారి రష్మీ ఫైర్ అయ్యింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కొంతమంది పిల్లలు కలిసి ఆరు అమాయకపు కుక్కపిల్లలను అతి కిరాతకంగా కొట్టి, నిప్పు పెట్టి సజీవదహనం చేసిన హృదయవిదారక ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్న విషయం తెల్సిందే. ఈ దారుణమైన వీడియో చూసి తీవ్ర ఆవేదనకు, ఆగ్రహానికి గురైన రష్మీ, మానవత్వం మంటగలిసిపోతున్న తీరుపై సోషల్ మీడియా వేదికగా మండిపడింది. ఈ భూమి నాశనం అయితే బావుండు అని ఆవేదన వ్యక్తం చేసింది.
'దేవుడా.. దయచేసి ఒక భయంకరమైన ప్రకృతి విపత్తును పంపించు. ఇందులో నా సొంత కుటుంబం, నాకు ఇష్టమైన వాళ్లు బలైపోయినా నేను పట్టించుకోను. కానీ ఈ భూమిపై ఒక ప్రక్షాళన జరగాలి.. మనకు అది అత్యవసరంగా కావాలి' అంటూ రష్మీ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. మూగజీవాలపై చిన్నపిల్లలు సైతం ఇంతటి క్రూరత్వాన్ని ప్రదర్శించడం చూసి ఆమె ఎంతలా చలించిపోయిందో ఈ పోస్ట్ స్పష్టం చేస్తోంది.
రష్మీ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు జంతు ప్రేమికులు రష్మీ ఆవేదనను అర్థం చేసుకుంటూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం కోపంలో సొంత కుటుంబాన్ని కూడా ఉద్దేశించి అంత తీవ్రమైన మాటలు అనడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా, ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ అమానుష ఘటన, రష్మీ స్పందన ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.