Anaganaga Oka Raju: వినోదంతో పాటు భావోద్వేగాలకు పెద్ద పీట!
ABN , Publish Date - Jan 08 , 2026 | 02:30 PM
నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన 'అనగనగా ఒక రాజు' మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో వినోదానికే కాకుండా భావోద్వేగాలకూ పెద్ద పీట వేసినట్టు నవీన్ పోలిశెట్టి చెబుతున్నాడు.
మూడు వరుస విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty). ఈ సంక్రాంతికి నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' (Anaganaga Oka Raju) తో అలరించనున్నాడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాతో మారి (Maari) దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary) హీరోయిన్ కాగా, మిక్కీ జె మేయర్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చాడు. జనవరి 14న ఈ సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా 8వ తేదీ ఉదయం హైదరాబాద్ శ్రీరాములు థియేటర్లో ట్రైలర్ ను ఆవిష్కరించారు. ఇది నాగార్జున వాయిస్ ఓవర్ తో ప్రారంభం కావడం విశేషం.
ఈ వేడుకలో కథానాయకుడు నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. 'ఈ ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఇది మా టీమ్ అందరి ఏడాదిన్నర కష్టం. ఈ సంక్రాంతికి మీ కుటుంబంతో కలిసి చూసి ఎంజాయ్ చేసేలా సినిమాని రూపొందించాం. మొదటి నుంచి చివరివరకు నవ్వుతూనే ఉంటారు. అదే సమయంలో అందమైన భావోద్వేగాలు కూడా ఉంటాయి. దర్శకుడు మారి మొదటి సినిమా అయినా చాలా బాగా తెరకెక్కించారు. ఈ సంక్రాంతికి నా అభిమాన హీరోలు ప్రభాస్ గారు, చిరంజీవి గారు, రవితేజ గారి సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. అన్ని సినిమాలు విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నాకు జరిగిన ఒక రోడ్డు ప్రమాదం వల్ల నా సినిమా రావడం ఆలస్యమైంది. ఆ లోటుని భర్తీ చేసేలా ఈ సినిమా రెట్టింపు వినోదాన్ని అందిస్తుంది' అని అన్నారు. మీనాక్షి చౌదరి మాట్లాడుతూ, 'ఈ సంక్రాంతికి మీ కుటుంబంతో వచ్చి ఈ సినిమాని ఎంజాయ్ చేయండి. ఇందులో నేను చారులత పాత్ర పోషించాను. ఇది నా మనసుకు దగ్గరైన పాత్ర. ఇది పక్కా పైసా వసూల్ మూవీ' అని చెప్పారు. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, 'ఈ ట్రైలర్ లో ఎలాగైతే పంచ్ లు పేలాయో సినిమా అంతా అలానే పంచ్ లు పేలతాయి. రెండు గంటల పాటు మిమ్మల్ని నవ్విస్తూ నవీన్ శైలిలో సాగే సినిమా ఇది. ఫ్యామిలీదో వచ్చి దీనిని ఎంజాయ్ చేయండి. పండగ సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి' అని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మారి కూడా పాల్గొన్నాడు.