GV Narayana Rao: నూటొక్క రూపాయల అడ్వాన్స్‌, నంది అవార్డు! జీవితంలో మ‌రిచిపోను

ABN , Publish Date - Aug 28 , 2026 | 06:30 AM

విలక్షణ నటుడు, నిర్మాత గుళ్లపల్లి వెంకట నారాయణరావు మరణంతో నగరంలోని కళా, సాంస్కృతిక రంగాలలోనూ విషాదఛాయలు అలు ముకున్నాయి.

GV Narayana Rao

రియలిస్టిక్ ఆర్టిస్ట్స్, ఆర్ట్ ఫిలిమ్స్, ఆప్డేట్ సినిమాలకు కేరాఫ్ సినిమా రంగంలో పేరు తెచ్చుకున్న ప్రముఖ నటుడు, నిర్మాత గుళ్లపల్లి వెంకట నారాయణరావు బుధవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. ఆయనకు 73 ఏళ్లు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కృష్ణాజిల్లా కురుమద్దాలి గ్రామంలో జన్మించారు. తండ్రి జి.డి. ప్రసాదరావు (నవయుగ పిక్చర్స్) డిస్ట్రిబ్యూటర్. ఆయన వ్యాపారరీత్యా గుంతకల్లులో ఉండటంతో నారాయణరావు విద్యాభ్యాసం అక్కడే జరిగింది. ప్రసాదరావు సారథి స్టూడియోస్‌కు మేనేజింగ్ డైరక్టర్ కావడంతో ఫ్యామిలీ హైదరాబాద్ కి షిఫ్ట్ అయింది. రవీంద్రభారతిలో నాటకాలు వేస్తున్న రోజుల్లో కోట శ్రీనివాసరావు, నూతన్ ప్రసాద్, దేవదాస్ కనకాలతో మంచి పరిచయం ఏర్పడింది. సినిమాల్లో నటించాలనే కోరిక కలగడంతో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌లో చేరినటనలో శిక్షణ పొందారు. తనతో పాటు శిక్షణ పొందిన రజనీకాంత్ ఆయనకు మంచి స్నేహం కుదిరింది. బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన 'అంతులేని కథ సినిమాతో వీరిద్దరూ నటులుగా పరిచయమయ్యారు. ఆసినిమా కోసం అందుకున్న నూటొక్క రూపాయల అడ్వాన్స్‌, నంది అవార్డును ఎప్పటికీ మర్చిపోలేమనేవారు నారాయణరావు.

'కుక్క', 'ముత్యాల పల్లకి', 'అంగడి బొమ్మ', 'చిలకమ్మ చెప్పింది', 'గ్యాంగ్ లీడర్', 'హిట్లర్' వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 'అంతులేని కథ చిత్రంలోని 'తాళి కట్టు శుభవేళ..మెడలో కళ్యాణ మాల' పాట నారాయణ రావుకు బాగా పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత వచ్చిన 'ముత్యాల పల్లికి' చిత్రంలో 'సన్నాజాజికి గున్నామానికి పెళ్లి కుదిరింది', 'సుబ్బారావుకి కోపం వచ్చింది' సినిమాలోని 'నీ పిలుపే ప్రభాత సంగీతం', 'మల్లి మల్లి ఏమి మల్లి జాజి మల్లి' పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి. మృణాల్ సేన్ దర్శకత్వంలో నటించిన 'ఒక ఊరి కథ చిత్రం ఆయన కెరీర్‌లో చాలా ప్రత్యేకం. పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు నారాయణరావును తీసుకెళ్లిన చిత్రమది. న్యూవేవ్ సినిమా ప్రభంజనం మొదలైన రోజుల్లో అమోల్ పాలేకర్, నసీరుద్దీన్ షా వంటి విలక్షణ నటుల ప్రభావం తనపై ఉందని చెప్పేవారు నారాయణరావు. రియలిస్టిక్ ఆర్టిస్ట్ అని ముద్రపడటంతో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు కాసింత దూరమైనా సినిమా రంగంలో ఏ విషయంలోనూ అసంతృప్తి లేదని గుర్తుచేసుకునే వారు.

నటనకు దూరం

ఆయన హీరోగా దాదాపు 35 సినిమాల్లో నటిస్తే 15 చిత్రాలు చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలాగని కేవలం హీరో పాత్రలే చేయాలనుకోలేదాయన. ఓ వైపు హీరోగా చేస్తూనే, కేరక్టర్లు కూడా చేసేవారు. 100కి పైగా సినిమాల్లో నటించిన ఆయనకు టీవీ రంగంలోనూ మంచి అనుభవం ఉంది. మెగాస్టార్ పర్సనల్ పనులు పర్యవేక్షించిన ఏడేళ్ల కాలం నటనకు దూరంగా ఉన్నారు. నారాయణరావుకు 'దేవాంతకుడు', 'ఇంటికో రుద్రమ్మ', 'యముడికి మొగుడు' సినిమాలు నిర్మాతగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆయన నిర్మించిన చివరి చిత్రం పెళ్లి నీకు శుభం నాకు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని 'మా' గుర్తుచేసుకుంది. నారాయణరావు అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో శుక్రవారం జరుగుతాయి.

మధుర జ్ఞాపకాలున్నాయి!

ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, నా ఆత్మీయ మిత్రుడు జీవీ నారాయణరావు ఇక లేరనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయ నతో నాకు ఎంతో సన్నిహితమైన అనుబంధం ఉంది. 'దేవాంతకుడు', 'యముడికి మొగుడు' వంటి చిత్రాలను నాతో నిర్మించిన నిర్మాతగా మా ప్రయాణంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు న్నాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. - చిరంజీవి

అంతా.. రవీంద్ర భారతియే

అంతులేని కథ సినిమాతో గోపాల్ పాత్రలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమై, ఐదు దశాబ్దాల పాటు తెలుగు రంగ స్థల, సినిమా, సీరియళ్లలో తనదైన అభినయంతో ప్రత్యేక గుర్తింపు పొందిన విలక్షణ నటుడు, నిర్మాత గుళ్లపల్లి వెంకట నారాయణరావు (G. V. Narayana Rao). ఆయన మరణంతో నగరంలోని కళా, సాంస్కృతిక రంగాలలోనూ విషాదఛాయలు అలు ముకున్నాయి. నారాయణరావు పుట్టింది కృష్ణా జిల్లా, కురు మద్దాలి గ్రామం, తన ఎనిమిదో ఏట వరకు పెరిగింది అనంతపురం జిల్లా, గుంత కల్లులో అయినా చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ శిక్షణ పొందిన రెండేళ్లు మినహాయిస్తే.. ఆయన జీవితమంతా హైదరాబాద్‌లోనే కొనసాగింది.

వారి కుటుంబం 1964లో నగరంలో స్థిరపడింది. నారాయణరావు తండ్రి నవయుగ పిక్చర్స్ అధినేత ప్రసాదరావు సారధి స్టూడియో మేనేజింగ్ డైరెక్టర్గా 1980వ దశకం వరకు బాధ్యతలు నిర్వర్తించారు. శాస్త్రీయ నృత్యం నేర్చుకో వాలన్న ఆసక్తితో పాటు నటుడు అవ్వాలన్న నారాయణ రావు కోరికను నెరవేర్చింది ఇక్కడి సాంస్కృతిక వాతావర ణమే. గిడుగు విశాలాక్షి దగ్గర కొద్ది కాలం భరత నాట్యం నేర్చుకున్నారు. ఆమె ప్రారంభించిన నృత్యాంజలి డ్యాన్స్ స్కూల్లో నారాయణరావు మొదటి బ్యాచ్ స్టూడెంట్, ప్రఖ్యాత నాట్య గురువు నటరాజ రామకృష్ణ దగ్గర కొంతకాలం కూచిపూడి సాధన చేశారు.

1969లో రవీంద్ర భారతిలో ప్రసిద్ధ రంగస్థల దర్శకుడు ఏఆర్ కృష్ణ సారధ్యంలోని నాట్యాలయ సంస్థలో ఏడాది పాటు నటనలో శిక్షణ పొందారు. దేశరాజు హనుమంతరావు దర్శకత్వంలో రవీంద్ర భారతి వేదికగా మహమ్మద్ బిన్ తుగ్లక్ నాటకంలో మొట్టమొదటిసారి ఆయన నటించారు. అదే సాంస్కృతిక కేంద్రంలో ప్రతాప రుద్రీయం, మంచుతెర తదితర నాటకాల్లో విభిన్న పాత్రలు పోషించారు. ఆ సమయంలోనే దేవదాసు కనకాల, కోటా శ్రీనివాసరావు, నూతన ప్రసాద్, విద్యాసాగర్, డీఎస్ దీక్షిత్ తదితరులు తనకు పరిచయమయ్యారని నారాయణరావు 'ఆంధ్రజ్యోతి'తో ఓ సంద ర్భంలో చెప్పారు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా 1982లో నారాయణరావు నిర్మించిన మొట్టమొదటి సినిమా దేవాంతకుడు చిత్రీకరణ మొత్తం నగరంలోనే జరిగింది. ఇవిగాక ఇక్కడే మరెన్నో సినిమాలు, సీరియళ్లలో ఆయన నటించారు. నారాయణరావు ప్రధాన పాత్ర పోషించిన ఆలోచన సినిమా కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇంతలోనే ఆయన దూరం కావడం బాధాకరమని సినీరంగ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. తనను నటుడిగా మలచింది నగరమే అని పలు వేదికలపై ప్రకటించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అభివృద్ధిలోనూ తనవంతు పాత్ర పోషించారు. సౌమ్యుడిగా, వివాద రహితుడిగా సినీ పరిశ్రమలో పేరు తెచ్చుకున్న నారాయణరావుకు నగరం అల్విదా!

Updated Date - Aug 28 , 2026 | 06:49 AM