Pawan Mahaveer: డాక్టర్‌గా వైద్యం... నటుడుగా వినోదం...
ABN , Publish Date - Jul 25 , 2026 | 02:17 PM
శివాల ప్రభాకర్ దర్శకత్వంలో శైలజ రెడ్డి నిర్మించిన సినిమా 'అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి'. పవన్ మహావీర్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా ఆగస్ట్ 7న విడుదల కానుంది.
పవన్ మహావీర్ ను హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ మహిళా వ్యాపారవేత్త శైలజ రెడ్డి నిర్మిస్తున్న విభిన్న ప్రేమకధా చిత్రం 'అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి'. పవన్ మహావీర్ లండన్ లో వైద్య విద్య అభ్యసిస్తూ హీరోగా నటించడం విశేషం. శివాల ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్షిక, సుహానా హీరోయిన్లు. సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని తొలుత జూలై 31న విడుదల చేయాలనుకున్నారు. అయితే తాజాగా ఈ సినిమాను ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ప్రకటించారు.
ఈ కార్యక్రమం దర్శకుల సంఘం అధ్యక్షులు వి.ఎన్. ఆదిత్య ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ప్రముఖ దర్శకులు సి. రాంప్రసాద్, శివనాగు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ విశిష్ట అతిధులుగా పాల్గొన్నారు. 'ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉందని, పవన్ మహావీర్ కి ఇది పరిచయ చిత్రమంటే నమ్మడం కష్టమ'ని అతిధులు పేర్కొన్నారు. నిర్మాతగా శైలజ రెడ్డి, హీరోగా పవన్ మహావీర్ కి ఉజ్వల భవిష్యత్ ఉండాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా నిర్మాత జి. శైలజరెడ్డి మాట్లాడుతూ, 'ఈ సినిమా మంచిగా రావడానికి సహకరించిన సాంకేతిక నిపుణులకు, నటీనటులకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ చిత్రాన్ని ఆగస్టు 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు. డాక్టర్ టర్నెడ్ హీరో మహావీర్ మాట్లాడుతూ, 'డాక్టర్ గా వైద్యం... హీరోగా వినోదం అందించాలనే తన సంకల్పం కార్యరూపం దాల్చడానికి కారకురాలైన దేవతలాంటి మా అమ్మకు ఈ జన్మంతా రుణపడి ఉంటాను. ఈ చిత్రం ఇంత గొప్పగా రావడం కోసం మనసుపెట్టి పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. మా చిత్రాన్ని ఆదరించాలని ప్రతి ఒక్కరీ కోరుకుంటున్నారు. దీని తర్వాత మరిన్ని చిత్రాలు వచ్చేలా ప్రోత్సహించగలరు' అని అన్నారు. దర్శకుడు శివాల ప్రభాకర్ ఈచిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన నిర్మాత శైలజ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. హీరోయిన్లు వర్షిక, సుహానా, 'సక్సెస్ మీట్ లో మళ్లీ కలుస్తామ'ని చెప్పి, ఈ చిత్రం సాధించబోయే సంచలన విజయం పట్ల తమకు గల నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
బాలయ్యకు సర్జరీ.. నారా బ్రహ్మణి ఏం చెప్పారంటే
రామా ఏంటిది.. ప్రమోషన్స్ కోసమే రూ. 375 కోట్లా?
బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభం