అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి
ABN , Publish Date - Jun 11 , 2026 | 07:15 PM
జిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రముఖ మహిళా వ్యాపారవేత్త జి. శైలజ రెడ్డి నిర్మిస్తున్న వినూత్న ప్రేమకథా చిత్రం ‘అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి.
జిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రముఖ మహిళా వ్యాపారవేత్త జి. శైలజ రెడ్డి నిర్మిస్తున్న వినూత్న ప్రేమకథా చిత్రం ‘అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి’. ఈ చిత్రంతో పవన్ మహావీర్ హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. శివాల ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వర్షిక, సుహానా కథానాయికలుగా నటిస్తున్నారు. సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర టీజర్‌ను ఘనంగా విడుదల చేశారు.
కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్, ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్, ఫిలిం చాంబర్ ప్రధాన కార్యదర్శి కె. అశోక్ కుమార్, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య, సీనియర్ ఫిలిం జర్నలిస్టులు ప్రభు, సురేష్ కొండేటి, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.
టీజర్‌ను వీక్షించిన అతిథులు చిత్ర బృందాన్ని అభినందించారు. తొలి సినిమాతోనే నిర్మాణంలోని అన్ని విభాగాలపై శైలజ రెడ్డి చూపిన శ్రద్ధ ప్రశంసనీయమని పేర్కొన్నారు. హీరో పవన్ మహావీర్ నటనలో కనిపించిన ఆత్మవిశ్వాసం, సహజత్వం ఆకట్టుకున్నాయని చెప్పారు. లండన్‌లో మెడిసిన్ చదువుతున్న పవన్ మహావీర్‌కు టాలీవుడ్‌లో మంచి భవిష్యత్తు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత శైలజ రెడ్డి మాట్లాడుతూ, సినిమా రూపుదిద్దుకోవడంలో సహకరించిన సాంకేతిక నిపుణులు, నటీనటులు, టీజర్ విడుదల కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు శివాల ప్రభాకర్ మాట్లాడుతూ, నిర్మాతగా శైలజ రెడ్డి, హీరోగా పవన్ మహావీర్ మంచి స్థాయికి చేరుకుంటారని నమ్మకం వ్యక్తం చేశారు. హీరోయిన్లు వర్షిక, సుహానా, నటి సుజాత, బాలనటి సుప్రీతి ఈ చిత్రంలో భాగమవడం ఆనందంగా ఉందని తెలిపారు.