ముక్కోణ ప్రేమకథా చిత్రంగా అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి!
ABN , Publish Date - Feb 18 , 2026 | 06:17 PM
శివాల ప్రభాకర్ దర్శకత్వంలో శైలజా రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి'. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు శివాల ప్రభాకర్ సాహిత్యం అందించారు.
పవన్ మహావీర్‌ను హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ మహిళా వ్యాపారవేత్త జి. శైలజా రెడ్డి నిర్మిస్తున్న ముక్కోణపు ప్రేమకథాచిత్రం 'అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి'. శివాల ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ వినూత్న ప్రేమ కథాచిత్రం షూటింగ్ కి ముందే పాటల రికార్డింగ్ పూర్తి చేసుకుంది. పవన్ మహావీర్ సరసన సుహాన జంటగా నటిస్తున్న ఈ చిత్రంలోని మరో హీరోయిన్‌ను త్వరలో రివీల్ చేస్తారు.
ప్రముఖ సంగీత దర్శకుడు సాయి కార్తీక్ (Sai Karthik) స్వర సారధ్యంలో దర్శకుడు శివాల ప్రభాకర్ (Sivala Prabhakar) సమకూర్చిన సాహిత్యానికి సుప్రసిద్ధ గాయనీగాయకులు చిత్ర (Chitra), హరిణి (Hairini), బృంద, అరుణ్, సాయి చరణ్, కృష్ణతేజస్వి గాత్రమందించారు. హైదరాబాద్, సారధి స్టూడియోలో అత్యంత ఘనంగా అతిరథమహారధుల సమక్షంలో ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రం ఈనెల 19 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది.
రాజమండ్రి సమీపంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం పట్టిసీమలో ప్రారంభమయ్యే ఈ షూటింగ్ తదుపరి వైజాగ్, అరకు ప్రాంతాలకు షిఫ్ట్ కానుంది. నిర్మాత జి. శైలజా రెడ్డి మాట్లాడుతూ, 'మా దర్శకుడు శివాల ప్రభాకర్ ఒక యజ్ఞంలా ఈ చిత్ర రూపకల్పన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీత సారధ్యంలో ప్రభాకర్ రాసిన పాటలు అద్భుతంగా కుదిరాయి. హీరోగా పరిచయమవుతున్న పవన్ మహావీర్‌కు ఉజ్వల భవిష్యత్ ఉంటుంది' అని అన్నారు. సీనియర్ యాకర్ట్ సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, రోహిణి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు, చిత్రానువాదం, దర్శకత్వం శివాల ప్రభాకర్.