కల్కి 2 షూటింగ్‌లో.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్
ABN , Publish Date - Feb 24 , 2026 | 06:13 PM
రెబల్ స్టార్ ప్రభాస్ పూర్తి చేయవలసిన సీక్వెల్స్ రెండున్నాయి.. వాటిలో ముందుగా 'కల్కి'ని పూర్తి చేస్తారని టాక్... ఎట్ ప్రెజెంట్ ప్రభాస్ రెండు సినిమాల్లో నటిస్తున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ పూర్తి చేయవలసిన సీక్వెల్స్ రెండున్నాయి.. వాటిలో ముందుగా 'కల్కి'ని పూర్తి చేస్తారని టాక్.. ఎట్ ప్రెజెంట్ ప్రభాస్ రెండు సినిమాల్లో నటిస్తున్నారు. అవి పూర్తయ్యాకే 'కల్కి' సెట్స్ పైకి వెళ్తుందని భావించారు. అయితే ప్రభాస్ లేని సీన్స్ ను మేకర్స్ తెరకెక్కిస్తున్నారు.
ఆసక్తి కలిగిస్తోన్న పిక్స్ ...
'కల్కి 2898 ఏడి' చిత్రాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ మల్టీస్టారర్ గా రూపొందిస్తున్నారు. అయితే ప్రభాస్ తరం హీరోల్లో ఆయన ఒక్కరే కనిపించినా, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి సీనియర్ స్టార్స్ కూడా ఇందులో నటిస్తున్నారు. 'కల్కి 2898 ఏడి'లో మహాభారతంలోని పాత్రలను చొప్పించి కథను మలిచారు. ప్రభాస్ ను కర్ణుడు మళ్ళీ జన్మించినట్టు చూపించారు... అయితే మరణంలేని విధంగా శాపం పొందిన అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ అలరించారు. మొదటి భాగంలో కమల్ హాసన్ కాసేపే తెరపై తళుక్కుమన్నారు. అయితే రెండో భాగంలో మాత్రం కమల్ విశ్వరూపం చూస్తారని పరిశీలకులు అంటున్నారు. అమితాబ్, కమల్ నటిస్తున్న సీన్స్ ను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన కొన్ని పిక్స్ కూడా హల్ చల్ చేస్తున్నాయి. అందువల్ల 'కల్కి-2' షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది.
అలా - కమల్ ఓ స్పెషల్... !
'కల్కి 2898 ఏడి'లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కనిపించినా, వారిద్దరి మధ్య సీన్స్ లేవు. అయితే రాబోయే సీక్వెల్ లో మాత్రం అమితాబ్, కమల్ పోటాపోటీగా నటించే సన్నివేశాలు ఉన్నాయని తెలుస్తోంది. 1985లో 'గిరఫ్తార్'లో నటించిన అమితాబ్, కమల్ హాసన్ మళ్ళీ ఇన్నాళ్ళకు కలసి నటించడం విశేషంగా మారింది. 'గిరఫ్తార్' తరువాతే ఇప్పుడు కమల్ హాసన్, రజనీకాంత్ కలసి నటించడం కూడా విశేషంగా మారింది. అలా ఓ వైపు తెలుగులోనూ, మరోవైపు తమిళంలోనూ 'గిరఫ్తార్' కాంబోలో కమల్ నటిస్తూ ఉండడం ఫ్యాన్స్ లో ఆసక్తిని కలిగిస్తోంది. 'కల్కి-2'లో కమల్ హాసన్ పోషిస్తోన్న యస్కిన్ పాత్ర మూవీకి హైలైట్ కాలగదని వినిపిస్తోంది.
నాటకాల్లో లాగా...
ప్రస్తుతం ప్రభాస్ తన 'ఫౌజీ', 'స్పిరిట్' సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ రెండు సినిమాలు పూర్తయ్యే సరికి 2026 గడచిపోతుంది. అందువల్ల వచ్చే సంవత్సరంలోనే 'కల్కి -2' షూటింగ్ లో ప్రభాస్ పాలు పంచుకుంటారని తెలుస్తోంది. అందువల్ల ప్రభాస్ వచ్చే సరికి, అందుబాటులో ఉన్న ఆర్టిస్ట్స్ తో మిగిలిన సీన్స్ రూపొందించడానికి ప్లాన్ చేశారు నాగ్ అశ్విన్. ఇందులో దీపికా పడుకోణె స్థానంలో సాయిపల్లవిని ఎంచుకున్నారని టాక్ !... అదే నిజమైతే పాత రోజుల్లో నాటకాల్లోలాగా ఒకే కథలో ఓ పాత్రను ఇద్దరు పోషించినట్టవుతుందని పరిశీలకుల మాట. ఏది ఏమైనా 'కల్కి-2' పట్టాలెక్కడం పట్ల ఆ సినిమా తరువాయి భాగం చూడాలని ఆశిస్తున్నవారికి ఆనందం కలుగుతోందని చెప్పవచ్చు. మరి ఈ సినిమా ఎప్పుడు జనం ముందు నిలుస్తుందో చూడాలి.