బాలయ్యతో.. అమెరిక‌న్‌ బోల్డ్ బ్యూటీ స్టెప్పులు

ABN , Publish Date - May 07 , 2026 | 03:29 PM

నటసింహం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది.

Balakrishna

నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna), మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్‌లో ఒక భారీ చిత్రం రూపుదిద్దుకుంటోంది. 'వీరసింహారెడ్డి' వంటి హిట్ తర్వాత వీరిద్దరూ కలిసి పని చేస్తుండటంతో, సహజంగానే NBK 111 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వీరసింహారెడ్డి విజయానికి ఏమాత్రం తగ్గకుండా, దర్శకుడు గోపీచంద్ ఈ చిత్రాన్ని మరింత పవర్‌ఫుల్‌గా తెరకెక్కిస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. తాజాగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నందమూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

సాధారణంగా బాలయ్య సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ అంటే థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండదు. ఈ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ మూవీలోనూ ఓ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశారు. వీరసింహారెడ్డి లో ఐటమ్ సాంగ్ కోసం చంద్రిక రవిని రంగంలోకి దించిన దర్శకుడు, ఈసారి బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రీ (Nargis Fakhri) ని ఎంపిక చేశారు. 'రాక్‌స్టార్', 'హౌస్‌ఫుల్ 5' వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు బాలయ్యతో కలిసి మాస్ స్టెప్పులు వేసేందుకు సిద్ధమైంది.

ఈ గ్లామరస్ ఎంట్రీ సినిమాపై బజ్‌ను ఒక్కసారిగా పెంచేసింది. ఈ మాస్ మసాలా పాట కోసం మేకర్స్ ఎలాంటి రాజీ పడకుండా ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ పాట చిత్రీకరణ కోసం ఒక ప్రత్యేకమైన సెట్‌ను నిర్మించారు. ఈ శుక్రవారం నుండే ఈ సాంగ్ షూటింగ్ ప్రారంభం కానుందట. బాలయ్య తనదైన ఎనర్జీతో వేసే పవర్‌ఫుల్ స్టెప్పులకు, నర్గీస్ ఫక్రీ గ్లామర్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర మోత మోగడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. ఈ సాంగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చినప్పటి నుండి నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో హంగామా మొదలుపెట్టారు. బాలయ్య ఎనర్జీకి నర్గీస్ గ్లామర్ తోడవుతుండటంతో సినిమా రికార్డులను తిరగరాయడం ఖాయమని అంటున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ చిత్రాలకు ఎస్.ఎస్. థమన్ సంగీతం ఒక ప్రత్యేక బలాన్ని ఇస్తుంది. వీరిద్దరి కలయికలో ఇప్పటికే వచ్చిన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి చిత్రాలు సంగీత పరంగా పెద్ద విజయాలు అందుకున్నాయి.

ఇప్పుడు రాబోతున్న NBK 111కు కూడా థమన్ అదిరిపోయే ట్యూన్స్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్‌లో థమన్ ఇచ్చే బీట్స్ థియేటర్లను హోరెత్తించడం చాలా మందికి తెలిసిన విషయమే. ఈ పాటలో కూడా ఆయన మ్యూజిక్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందని సమాచారం. మరి బాలయ్య ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.

Updated Date - May 07 , 2026 | 03:29 PM