అమీర్ లోగ్ నుంచి ‘కాసుల కళ’ పాట విడుదల.. మధ్యతరగతి జీవితాన్ని హత్తుకునే మెలోడీ

ABN , Publish Date - Aug 03 , 2026 | 06:57 AM

ఆగస్టు 21న విడుదల కానున్న ‘అమీర్ లోగ్’ సినిమా నుంచి ‘కాసుల కళ’ పాట విడుదలైంది. మధ్యతరగతి జీవితాన్ని ప్రతిబింబించే ఈ మెలోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Ameer Log

'అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్' పతాకంపై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’ (Ameer Log) ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా ఈ సినిమాను ఆగస్టు 21న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

సినిమా ప్రచారంలో భాగంగా ఇప్పటికే విడుదలైన పాటలు మంచి స్పందన అందుకోవడంతో, తాజాగా మరో భావోద్వేగభరితమైన గీతాన్ని విడుదల చేశారు. ‘కాసుల కళ’ పేరుతో వచ్చిన ఈ పాట మధ్యతరగతి కుటుంబాల ఆశలు, కష్టాలు, జీవిత పోరాటాన్ని హృదయానికి హత్తుకునేలా ఉంది. నిఖ్లేష్ సుంకోజి అందించిన‌ సాహిత్యం జీవిత వాస్తవాలను సున్నితంగా ప్రతిబింబిస్తే, సంగీత దర్శకుడు స్మరణ్ సాయి స్వరపరిచిన బాణీలు, సింగ‌ర్ ఏక్‌నాథ్ గాత్రం పాటకు మరింత హుషారు తీసుకొచ్చాయి.

హైదరాబాద్ నగరంలోని సాధారణ ప్రజల జీవనశైలిని సహజత్వంతో చూపించే కథాంశంతో ‘అమీర్ లోగ్’ రూపొందుతోంది. స్థానిక సంస్కృతి, నగరంలోని మరో కోణాన్ని తెరపై చూపించే ప్రయత్నంగా ఈ సినిమా ఉండబోతోందని చిత్రబృందం చెబుతోంది. ఈ చిత్రానికి ఎస్వీకే సినిమాటోగ్రఫీ అందించగా, రోహిత్ పెనుమత్స ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. స్మరణ్ సాయి సంగీతం సినిమాకు మరో ప్రధాన బలంగా నిలవనుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార కంటెంట్ ఆసక్తిని పెంచుతుండగా, ఆగస్టు 21న విడుదల కానున్న ‘అమీర్ లోగ్’ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Updated Date - Aug 03 , 2026 | 06:57 AM