Allu Arjun: ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ మీట్.. అసలు కారణం ఇదే..
ABN , Publish Date - Jul 28 , 2026 | 07:01 PM
అభిమానులంటే తనకు ఎంత ప్రత్యేకమైన అనుబంధమో మరోసారి నిరూపించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
అభిమానులంటే తనకు ఎంత ప్రత్యేకమైన అనుబంధమో మరోసారి నిరూపించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించే బన్నీ.. ఈసారి తన అభిమానులతో నేరుగా మమేకమై వారికి జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని అందించారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర నుంచి వచ్చిన సుమారు 900 మంది అభిమానులతో మంగళవారం ఫ్యాన్స్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభిమానుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ఆధ్వర్యంలో ప్రతి అభిమానికీ బీమా పాలసీలను అందజేశారు. అభిమానుల భద్రత, వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయం అందరి ప్రశంసలను అందుకుంటోంది.
ఇక్కడ మరో విషయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బన్నీ అభిమానులతో దాదాపు ఆరు గంటల పాటు వేదికపైనే గడిపారు.ప్రతి అభిమానిని వ్యక్తిగతంగా పలకరిస్తూ, వారితో కలిసి ఫొటోలు దిగారు. తమ అభిమాన హీరోతో ఇలా ఆత్మీయంగా మాట్లాడే అవకాశం దక్కడం జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకమని అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ తరహా ఫ్యాన్స్ మీట్లను ఒకసారితో ఆగిపోకుండా ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహించాలని అల్లు అర్జున్ భావిస్తున్నట్లు సమాచారం. అభిమానులతో మరింత దగ్గరగా ఉండటం, వారి అభిప్రాయాలు తెలుసుకోవడం, సంక్షేమ కార్యక్రమాలను విస్తరించడం ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.