విశాఖకు.. అల్లు అర్జున్! భద్రత కట్టుదిట్టం
ABN , Publish Date - Aug 06 , 2026 | 05:10 PM
అల్లు అర్జున్ ఈ నెల 9న విశాఖలోని AAA సినిమాస్ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
విశాఖపట్నంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 9న ఆంధ్రప్రదేశ్‌లో ఆయన భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన తొలి మల్టీప్లెక్స్ AAA సినిమాస్ ప్రారంభోత్సవానికి అల్లు అర్జున్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అభిమానుల రద్దీని దృష్టిలో పెట్టుకుని విశాఖ పోలీసులు కట్టుదిట్టమైన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించారు.
ప్రస్తుత సమాచారం ప్రకారం మల్టీఫ్లెక్స్ ప్రారంభోత్సవం జరిగే రోజున మాల్‌లోకి సాధారణ ప్రజలను అనుమతి నిషేదించారు. కార్యక్రమంలో పాల్గొనబేయే నిర్వాహకులు, ఆహ్వానితులు, సంబంధిత సిబ్బందికి మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు. అంతేగాక అల్లు అర్జున్ మాల్‌లో ఉన్నంతసేపు మాల్‌ను తాత్కాలికంగా మూసివేయనున్నట్లు తెలుస్తోంది.
అయితే.. సంధ్య థియేటర్ ఘటన తర్వాత భారీ జనసమూహం ఉండే కార్యక్రమాల విషయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. మల్టీప్లెక్స్ యాజమాన్యంతో సమన్వయం చేసుకుంటూ పోలీసులు ప్రత్యేక భద్రతా ప్రణాళికను అమలు చేస్తున్నారు. కాగా అభిమానులను పూర్తిగా నిరాశ పరచకుండా, మాల్ బయట వేచి ఉండే వారి కోసం అల్లు అర్జున్ అభివాదం చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
కాగా, విశాఖపట్నంలో ప్రారంభమవుతున్న AAA సినిమాస్‌లో మొత్తం ఎనిమిది అత్యాధునిక స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓ సినీ హీరో భాగస్వామ్యంతో ప్రారంభమవుతున్న తొలి మల్టీప్లెక్స్‌గా ఇది ప్రత్యేకతను సంతరించుకుంది. దీంతో ఈ ప్రారంభోత్సవంపై సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.