పంద్రాగస్ట్ వివాదంలో బన్నీ, విజయ్ దేవరకొండ!
ABN , Publish Date - Aug 17 , 2026 | 01:43 PM
టాలీవుడ్ స్టార్ హీరోలు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ కు సంబంధించిన పోస్టర్స్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. దాంతో వెంటనే వాటిని సోషల్ మీడియా నుంచి తొలగించారు.
సినిమా స్టార్స్ వివాదాలకు దూరంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఒక్కోసారి ఊహించని విధంగా వివాదాలు వారిని చుట్టుముడుతుంటాయి. అలాంటిదే ఆగస్ట్ 15న తెలుగు స్టార్ హీరోలు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ విషయంలో జరిగింది. అల్లు అర్జున్ ఆగస్ట్ 15, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఓ పోస్ట్ పెట్టారు. అందులో ఢిల్లీ ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలాడుతున్నట్టుగా ఉంది. అయితే ఆ జెండాలో అశోక చక్రం మిస్ అయ్యింది. దాంతో కొందరు నెటిజన్స్ జాతీయ పతాకాన్ని అలా ఎలా తప్పుగా చూపిస్తారంటూ కామెంట్స్ పెట్టారు. ఆ వెంటనే, బన్నీ పీ.ఆర్. టీమ్ సోషల్ మీడియా నుంచి ఆ పోస్టర్ ను తొలగించింది. అయితే అప్పటికే కొందరు దాని స్క్రీన్ షాట్ ను తీసుకుని, అల్లు అర్జున్ ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే... ఆగస్ట్ 15నే విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'రణబాలి'కి సంబంధించిన పోస్టర్ ను చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసింది. ప్రేక్షకులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ఆ పోస్టర్ ద్వారా తెలిపింది. రక్తసిక్తమైన దేహంతో ఉన్న విజయ్ దేవరకొండ భారత జాతీయ పతాకాన్ని తన ఒంటికి కప్పుకున్నట్టుగా ఆ పోస్టర్ ను తయారు చేశారు. దాని మీద కూడా కొన్ని రక్తపు మరకలు ఉన్నాయి. ఈ పోస్టర్ పై ఎలాంటి వివాదం తలెత్తకపోయినా... ముందు జాగ్రత్తగా కావచ్చు, వెంటనే దానిని సోషల్ మీడియా నుంచి తొలగించి జాతీయ జండా రెపరెపలాడుతున్న నేపథ్యంలో హీరో గుర్రంపై వస్తున్న పోస్టర్ ను తిరిగి పోస్ట్ చేశారు. ఆగస్ట్ 15న తెలుగు సినిమా రంగంలో చోటు చేసుకున్న ఈ రెండు సంఘటనలతో అగ్ర కథనాయకులకు చెందిన పీ.ఆర్. టీమ్, నిర్మాణ సంస్థలు కొన్ని విషయాలలో మరింత శ్రద్ధ చూపించాల్సి ఉంటుందని తెలిసింది. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత పోస్టర్స్ ను అధికారికంగా తొలగించినా... కొందరు అత్యుత్సాహంతో అప్పటికే తీసిన స్క్రీన్ షార్ట్స్ ఆ వివాదాలను సజీవంగానే ఉంచుతాయి. చిత్రం ఏమంటే.. దేశ ప్రధాని మోదీ అదే రోజున తన కోటులో పెట్టుకున్న మూడు రంగుల చేతిగుడ్డను సైతం కొందరు నెటిజన్స్ విమర్శించారు. అయితే అది జాతీయ జెండా కాదని, కేవలం మూడు రంగులు ఉన్న కర్ఛీఫ్ మాత్రమేనని కొందరు వివరణ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
రైలులో హీరోయిన్ హల్చల్.. బట్టలు విప్పేసి బ్లేడుతో దాడి
బండ్ల గణేష్ కూతురు పెళ్లి.. అక్కినేని కోడలే హైలైట్
రష్మిక షో ఆఫ్ కామెంట్స్‌పై యశ్ రియాక్షన్.. అసలు నిజం ఇదిగో