Allu Arjun: స్టార్‌డమ్ కాదు.. కథే ముఖ్యం.. అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 27 , 2026 | 02:47 PM
జాతీయ అవార్డు గ్రహీత, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది.
జాతీయ అవార్డు గ్రహీత, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది. ఫోర్బ్స్ ఇండియా తాజాగా ‘షో స్టాపర్స్ 2026’ పేరుతో 100 మంది ప్రముఖుల జాబితాను విడుదల చేసింది. 2025 జనవరి నుంచి 2026 మార్చి వరకు సినిమా, ఓటీటీ, క్రీడలు, సంగీతం, టెలివిజన్ తదితర రంగాల్లో విశేష ప్రభావం చూపిన వారిని ఈ జాబితాలో ఎంపిక చేశారు. దేశంలోని ప్రముఖ సెలబ్రిటీలను గుర్తిస్తూ ఫోర్బ్స్ ఇండియా రూపొందించిన ‘షో స్టాపర్స్ 2026’ ఎడిషన్ కవర్‌పై అల్లు అర్జున్ మెరిశారు. తనదైన స్టైల్, ఆకట్టుకునే లుక్‌తో కవర్‌పై కనిపించిన బన్నీ.. మరోసారి జాతీయ స్థాయిలో తనకున్న క్రేజ్‌ను చాటుకున్నారు. ‘పుష్ప’ ఫ్రాంచైజీ చిత్రాలతో అల్లు అర్జున్ క్రేజ్ దేశవ్యాప్తంగా మరింత పెరిగింది. ముఖ్యంగా ‘పుష్ప: ది రైజ్’, ‘పుష్ప 2: ది రూల్’ చిత్రాలతో ఆయన మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్, స్టైల్ ప్రాంతాల హద్దులను దాటాయి. దీంతో తెలుగు సినిమా నుంచి వచ్చిన ఓ నటుడు జాతీయ స్థాయిలో ఇంతటి ప్రభావాన్ని చూపించడం విశేషంగా మారింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ' బాలీవుడ్ అయినా, దక్షిణాది సినిమా అయినా, మరే ఇతర ప్రాంతీయ చిత్ర పరిశ్రమ అయినా.. బాక్సాఫీస్ వద్ద సినిమా విజయం సాధించాలంటే కథ, కంటెంట్ కీలకమని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. భాషతో సంబంధం లేకుండా మంచి కథను ప్రేక్షకులకు అందిస్తే సినిమా తప్పకుండా ఆదరణ పొందుతుందని అన్నారు. సినిమాలో నటించే హీరో, హీరోయిన్ల స్టార్‌డమ్ కంటే సరైన కథే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందని, చివరికి చిత్ర విజయాన్ని కూడా అదే నిర్ణయిస్తుందని చెప్పారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలకు భాషా హద్దులు చెరిగిపోతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
.అల్లు అర్జున్‌తో పాటు భారతీయ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. అమితాబ్ బచ్చన్, మోహన్‌లాల్, రజనీకాంత్, రామ్ చరణ్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, ఏఆర్ రెహమాన్, బాబీ డియోల్, దుల్కర్ సల్మాన్, ఆర్. మాధవన్, రణ్‌వీర్ సింగ్, రిషబ్ శెట్టి, కల్యాణి ప్రియదర్శన్, కంగనా రనౌత్ తదితరులు ‘షోస్టాపర్స్ 2026’లో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాకా' సినిమాలో నటిస్తున్నారు.