Allu Arjun: రాకా’లో ఏముంది?.. త్వరలోనే అన్ని ప్రశ్నలకు సమాధానం

ABN , Publish Date - Aug 06 , 2026 | 09:07 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, స్టార్ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న  చిత్రం ‘రాకా’.  ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఇది 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) , స్టార్ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న  చిత్రం ‘రాకా’(Raaka)   ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఇది  ఒకటి. ‘పుష్ప’ సినిమాల తర్వాత అల్లు అర్జున్‌ నటిస్తున్న సినిమా కావడం, అట్లీ దర్శకత్వం వహిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత ఏడాది చివర్లో సినిమా షూటింగ్ మొదలైంది. అయితే సినిమా గురించి పెద్దగా అప్డేట్ బయటకు రాలేదు. అల్లు అర్జున్, దీపికా గురించి తప్పితే సినిమాలో ఇంకెవరు ఉన్నారో కూడా సమాచారం లేదు. దీంతో కథ ఎలా ఉండబోతోంది? అల్లు అర్జున్‌ పాత్ర ఏమిటి? ఇతర నటీనటులు ఎవరు? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే ఇందులో బన్నీ డ్యూయెల్ రోల్ చేస్తారని మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, దీనిపై కూడా ఎలాంటి అప్డేట్ లేదు. ఇప్పుడు ఆ ప్రశ్నలన్నింటికీ త్వరలోనే సమాధానం దొరికే అవకాశం కనిపిస్తోంది. బన్నీ సన్నిహితుల సమాచారం ప్రకారం, చిత్రబృందం ఈ నెలలోనే ప్రత్యేక ప్రచార వీడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోందట. 

భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి గ్లింప్స్  విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీని ద్వారా సినిమా కథా, ప్రధాన పాత్రలు, విజువల్ కాన్సెప్ట్‌, తారాగణం వంటి కీలక అంశాలను పరిచయం చేసే అవకాశం ఉందని తెలిసింది. మరోవైపు రష్మిక మందన్న, జాన్వీ కపూర్‌, మృణాల్ ఠాకూర్‌ వంటి నటీమణుల పేర్లు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన లేదు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆగస్టులో రానున్న ప్రత్యేక అప్‌డేట్‌తో ‘రాకా’పై నెలకొన్న సందేహాలకు తెరపడుతుందా? అనే ఆసక్తితో అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Updated Date - Aug 06 , 2026 | 09:18 AM