అల్లు అర్జున్ కు అత్యధిక పారితోషికం !

ABN , Publish Date - Sep 08 , 2026 | 03:55 PM

ఆల్ ఇండియాలోనే హయ్యెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్స్ లో ఇప్పుడు నంబర్ వన్ ప్లేస్ ను టాలీవుడ్ స్టార్ ఆక్రమించాడు. అతను మరెవరో కాదు ఐకాన్ స్టార్ బన్నీ!

Icon Star Allu Arjun

ఇంతింతై వటుడింతై అన్న చందాన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక్కో మెట్టూ ఎక్కుతూ పోతున్నారు. ఇప్పుడు ఆల్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం పుచ్చుకుంటున్న హీరోగా అల్లు అర్జున్ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా రూపొందుతోన్న 'రాకా' సినిమా కోసం ఆయనకు అక్షరాలా మూడు వందల కోట్ల రూపాయలు అందుతోందట. రెమ్యూనరేషన్ కింద 150 కోట్లు, రిలీజ్ అయ్యాక ప్రాఫిట్ లో 33 శాతం వాటా ఉందట. మొత్తం కలిపితే 300 కోట్ల రూపాయలు అని ట్రేడ్ పండిట్స్ లెక్క తేల్చేశారు. వరుస విజయాలతో సాగుతోన్న అల్లు అర్జున్ ఒక్కో సినిమాకు తన రేటును పెంచుకుంటూ పోతున్నారు. అలా ఇప్పటికి మూడువందల కోట్లకు చేరుకున్నారు.


'అల వైకుంఠపురములో' గ్రాండ్ సక్సెస్ తరువాత అల్లు అర్జున్ రేంజ్ పెరిగిపోయింది. ఈ సినిమా సక్సెస్ అయిన తరువాత నిర్మాతలు బన్నీకి మరింత మొత్తం ముట్టచెప్పినట్టు టాక్. ఆ తరువాత బన్నీ నటించిన 'పుష్ప' సిరీస్ కు పారితోషికంతో పాటు కొంత వాటా కూడా అందుకున్నారు. ఆ చిత్రాల ద్వారానే అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ 200 కోట్ల రూపాయలు టచ్ చేసిందని టాక్. ఇప్పుడు అట్లీ కుమార్ డైరెక్షన్ లో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోన్న 'రాకా'కు ఏకంగా మూడు వందల కోట్ల రూపాయలు అందుకుంటున్నారట బన్నీ. అందుకు తగ్గట్టుగానే బన్నీ 'రాకా' మూవీ కోసం డేట్స్ కేటాయించారనీ వినిపిస్తోంది. వాస్తవానికి 'రాకా' షూటింగ్ గత సంవత్సరం చివరలో మొదలయింది. ఇక ఈ మూవీ పూర్తయి ప్రేక్షకుల ముందుకు రావడానికి వచ్చే యేడాది ఆఖరవుతుందని వినికిడి. అంటే దాదాపు రెండేళ్ళకు బన్నీ డేట్స్ కోసం 300 కోట్లు పుచ్చుకోవడం సబబే కదా అంటున్నారు సినీజనం.


మొన్నటి దాకా మన దేశంలో అత్యధిక పారితోషికం పుచ్చుకున్నవారిలో షారుఖ్ ఖాన్ నంబర్ వన్ గా ఉన్నారు. ఆయన నటించిన 'పఠాన్, జవాన్' చిత్రాల్లో ఒక్కోదానికి 300 కోట్లు అందుకున్నారని బాలీవుడ్ టాక్. ఆ తరువాత వచ్చిన షారుఖ్ మూవీ 'డంకీ' ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో షారుఖ్ స్వయంగా తన రేటు తగ్గించుకున్నారనీ తెలుస్తోంది. ప్రభాస్, విజయ్ మినహాయిస్తే దేశంలో అత్యధిక పారితోషికం పుచ్చుకున్న రజనీకాంత్, ఆమిర్ ఖాన్, షారుఖ్ వంటివారు పారితోషికంతో పాటు లాభాల్లో వాటా అందుకున్నవారే. అందువల్ల వారి పారితోషికాలు సక్సెస్ ను బట్టే ఆధారపడి ఉంటాయి. అలా రజనీకాంత్ 280 కోట్లు, ఆమిర్ ఖాన్ 250 కోట్లు అందుకొని ఉంటారని తెలుస్తోంది. ఇక విజయ్ 275 కోట్లు, ప్రభాస్ 200 కోట్ల దాకా తీసుకుంటారని వినికిడి. ఏది ఏమైనా ఇప్పుడు 300 కోట్ల రూపాయల పారితోషికం పుచ్చకుంటున్న స్టార్ గా అల్లు అర్జున్ నిలిచారు. మరి 'రాకా' కూడా గ్రాండ్ సక్సెస్ సాధిస్తే బన్నీ రెమ్యూనరేషన్ ఎంతవుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

జీవకళను బుల్లెట్లు శాశ్వతంగా చంపలేవు: యండమూరి

Malavika Mohanan: విజయ్‌తో సినిమా.. మాళవికకు త్రిష మెసేజ్ ఇదే..

Nagarjuna - DSP: హ్యాట్రిక్‌ ఇచ్చిన డిసెంబర్ మాసం...

Updated Date - Sep 08 , 2026 | 03:57 PM