అల్లు అర్జున్, అట్లీ.. 'రాకా' టైటిల్ అదిరింది
ABN , Publish Date - Apr 08 , 2026 | 11:28 AM
అల్లు అర్జున్, అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం టైటిల్‌ను బుధవారం ప్రకటించారు.
అల్లు అర్జున్ (Allu Arjun), అట్లీ (Atlee)కాంబోలో ఓ భారీ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ మూవీలో అల్లు అర్జున్ విభిన్న పాత్రలో సూపర్ హీరోగా కనిపించనున్నాడు. ఆయన సరసన దీపిక పదుకునే (Deepika padukone) సహా మరో నలుగురు భామలు కథానాయికలుగా నటిస్తోన్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదల చేసిన గ్లింప్స్ వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం అయింది.
అయితే.. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఏఏ 22..అట్లీ 6’ చిత్రం అప్డేట్ ఎట్టకేలకు వచ్చేసింది. బుధవారం, ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించి, ఆయన లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘రాకా’ అనే శక్తిమంతమైన టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఓ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు. గుండుతో ఓ వింత శరీరాకృతిలో ఉన్న అల్లు అర్జున్ లుక్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇందులో ఆయన పాత్ర ఎలా ఉండబోతోందనే ఆసక్తిని అందరిలోనూ రేకెత్తించింది.

నిర్మాతలు ఇచ్చిన ఈ ప్రకటనతో అల్లు ఫ్యాన్స్ ఉబ్బి తబ్బిబవుతున్నారు. అంతేగాక ఎవరూ ఊహించని విధంగా డిఫరెంట్, క్యాచీ టైటిల్ ఎనౌన్స్ చేయడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ ఫొటో, సినిమా పేరు రాకా జాతీయ స్థాయిలో సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
ఇది కేవలం ఫిల్మ్ కాదు..
ఈ సందర్భంగా దర్శకుడు అట్లీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ‘ఇది కేవలం ఫిల్మ్ కాదు. నాతో 18 ఏళ్లుగా ప్రయాణిస్తున్న భావోద్వేగం.. కల. ఈ ఆలోచన నాలో ఎంతో మార్పుని తెచ్చింది. ఇది ఆరంభం మాత్రమే’ అని పేర్కొన్నారు. ‘ఈ సినిమా మీ ఊహలకు అందని విధంగా విధంగా ఉంటుంది. మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి’ అని చిత్రయూనిట్ పేర్కొంది. సమాంతర ప్రపంచాలు.. పునర్జన్మల నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు మేకర్స్.
ఇందులో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారని టాక్. ఆయన పోషిస్తున్న ఓ పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయని.. అందుకే ఈ పాత్ర పేరు ‘రాకా’నే టైటిల్‌గా మార్చినట్లు సమాచారం. దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీతో సహా మొత్తం ఏడు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.