‘అల్లు సినిమాస్‌’ ఐడియా వెనుక కారణలివే..

ABN , Publish Date - Mar 13 , 2026 | 06:12 PM

అల్లు అరవింద్ ‘అల్లు సినిమాస్‌’ ప్రారంభించడానికి గల కారణాలను వివరించారు. ప్రపంచంలో ఉన్న మూడు బిగ్గెస్ట్‌ డాల్బీ సినిమాస్‌లో అల్లు సినిమాస్‌ ఒకటని అన్నారు.


థియేట్రికల్‌ డీటీఎస్‌ ఎక్స్‌పీరియన్స్‌లో డాల్బీ ఓ సంచలనం. డాల్బీ డీటీఎస్‌ సిస్టంకు అలవాటు పడిన ప్రేక్షకులు సాధారణ సరౌండింగ్‌ సిస్టం ఉన్న థియేటర్‌లో సినిమా చూడటానికి ఇష్టపడరు. అలాగని ఇప్పుడు డీటీఎస్‌ లేని థియేటర్‌ లేదు. దానికి తోడు ఏడేళ్ల క్రితమే సౌండింగ్‌లో మరో సంచలనం డాల్బీ అట్మాస్‌ వచ్చింది. ఈ ఫీచర్‌తో థియేటర్‌లో సినిమా చూసిన ప్రేక్షకుడు అట్మాస్‌ సౌండ్‌సిస్టం లేని థియేటర్‌కు వెళ్లి సినిమా చూడమంటే ససేమిరా కాదంటాడు. అంతగా ‘డాల్మీ అట్మాస్‌’ సౌండ్‌ సిస్టం ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని కలిగించింది. నేటితరం ప్రేక్షకుడు సౌండింగ్‌లోనే కాదు.. విజువల్‌గానూ స్క్రీన్‌ మీద కొత్త అనుభూతిని పొందాలనుకుంటున్నాడు. అలాంటి ఓ కొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందించబోతున్నారు అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌.

ఆయన కోకాపేటలో కొత్తగా ‘అల్లు సినిమాస్‌’ పేరుతో మల్టీప్లెక్స్‌ను నిర్మించారు. అందులో మూడు స్క్రీన్లు 70ఎంఎం, డాల్మీ అట్మాస్‌ ఫీచర్స్‌తో ఉండగా.. మరో ప్రత్యేక థియేటర్‌ను లాంచ్‌ చేశారు. అదే డాల్బీ సినిమా. ఇండియాలోనే ప్రీమియమ్‌ లార్జ్‌ ఫార్మెట్‌ సినిమా థియేటర్‌ ఇది. ప్రస్తుతం డాల్బీ విజన్‌ థియేటర్స్‌ విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మన దేశంలో హైదరాబాద్‌లో ఇటీవల అల్లు అరవింద్‌ లాంచ్‌ చేశారు. ఇండియాలోనే అది పెద్ద డాల్బీ స్క్రీన్ గా దీనిని చెబుతున్నారు.

Allu-dolby.jpg

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ
‘అల్లు సినిమాస్‌ ప్రారంభించడానికి కొన్ని కారణాలున్నాయి. నిర్మాతల్లో మిత్రుడైన యువి క్రియేషన్స్‌ వంశీ సూళ్లూరుపేటలో పెద్ద స్క్రీన్స్ తో థియేటర్‌ కట్టారు. అప్పట్లో మల్టీప్లెక్స్‌ థియేటర్స్‌లో అది పెద్దది. కొత్త టెక్నాలజీతో రూపొందించారు. దాన్ని చూసి తొలుత ఆ ప్రాంతంలో అంత ఖర్చుతో ఆ థియేటర్‌ ఎందుకు కడుతున్నారు? అని అనుకున్నారు. కానీ ఆ చుట్టు పక్కల ప్రాంతాల వారంతా సింగిల్‌ థియేటర్స్‌ను వదిలి ఆ థియేటర్‌కు వచ్చి సినిమాను ఎంజాయ్‌ చేస్తున్నారు. బిగ్‌ స్క్రీన్స్ తో , సౌండింగ్‌ను ఆస్వాదిస్తున్నారు. ఇంకోసారి నాకు తెలిసిన పెద్దాయన ఒకరు ఫోన్‌ చేసి ఐమ్యాక్స్‌ బిగ్‌ స్క్రీన్స్ లో (పీసీఎక్స్‌) మిషన్‌ ఇంపాజిబుల్‌-3 (2006) సినిమాకు ఆరు టికెట్లు ఇప్పించమని అడిగారు. ఈ రెండు సంఘటనలు చూశాక హ్యూజ్‌ ఫార్మాట్‌కు, లార్జ్‌ ఫార్మాట్‌కు తేడా ఉందని, ప్రేక్షకుల సింగిల్‌ స్క్రీన్‌, మల్టీప్లెక్స్‌ కాదు.. లార్జ్‌ స్క్రీన్స్ ఎక్స్‌పీరియన్స్‌ కోరుకుంటున్నారని అర్థమైంది. అందుకే మల్టీప్లెక్స్‌ను మించి ఇలాంటి ఓ థియేటర్‌ కట్టాలనుకున్నా.. 2024లో మేం డాల్బీ సంస్థని సంప్రదించాం. డాల్బీ సినిమాస్ ఇండియా ప్రతినిథి రాజ్ ఎంతో సహకరించారు. వర్క్ పర్ఫెక్షన్ కోసం  అమెరికా, జర్మనీ, ఇండియన్ టీం... ఇలా అందరం కలిసి ఓ డెబ్బై సార్లు జూమ్ కాల్స్‌లో మాట్లాడుకున్నాం. ఇందులో నాలుగు స్క్రీన్స్ ఉన్నాయి. అందులో ఒకటి డాల్బీ సినిమా థియేటర్‌. అల్లు విజన్‌కు, డాల్బీకి పెళ్లి చేస్తే జన్మించిందే డాల్బీ సినిమా. ఇది సౌండ్‌ పరంగానే కాదు.. విజువల్‌గాను, త్రీడీ ఫార్మెట్‌లోనూ వీక్షకుడికి కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది’ అని అన్నారు.  

Updated Date - Mar 13 , 2026 | 08:04 PM