అందరి చూపు బాబు పైనే.. ఇంతకు వస్తాడా లేదా! రాజమౌళి పర్మిషన్ ఇచ్చేనా
ABN , Publish Date - Jul 24 , 2026 | 07:10 AM
టాలీవుడ్ దిగ్గజ కుటుంబం, సూపర్ స్టార్ కృష్ణ కాంపౌండ్ నుంచి మరో నట వారసుడు గ్రాండ్ ఎంట్రీకి సిద్ధమయ్యాడు.
టాలీవుడ్ దిగ్గజ కుటుంబం, సూపర్ స్టార్ కృష్ణ కాంపౌండ్ నుంచి మరో నట వారసుడు గ్రాండ్ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. కృష్ణ మనవడు, రమేష్ బాబు తనయుడు జయకృష్ణ (Jayakrishna) శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram) సినిమాతో వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో జయకృష్ణ సరసన రషా తడానీ (Rasha Thadani) కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ప్రేక్షకుల్లో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది.
అంతేకాదు.. ఈ సినిమా రిలీజ్ డేట్ వెనుక ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ దాగి ఉంది. మహేష్ బాబు హీరోగా డెబ్యూ మూవీ రాజకుమారుడు సినిమా కూడా సరిగ్గా జులై 30న విడుదలై ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలుసు. ఇప్పుడు అదే జులై 30న జయకృష్ణ 'శ్రీనివాస మంగాపురం' కూడా థియేటర్లలోకి రాబోతోంది. ఈ డేట్ సెంటిమెంట్ ఖచ్చితంగా కలసి వస్తుందని ఘట్టమనేని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం మూవీ యూనిట్ ఇంటర్వ్యూలు, ప్రమోషన్లతో ఫుల్ బిజీగా ఉంది. అయితే.. ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో ఒకే ఒక్క ప్రశ్న మార్మోగిపోతోంది.
అదేంటంటే.. తన అన్న కొడుకు జయకృష్ణ కోసం మహేష్ బాబు (Mahesh Babu) ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరవుతారా లేదా..? ప్రస్తుతం మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న భారీ అడ్వెంచరస్ మూవీ వారణాసి షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దాదాపు 9 నెలలుగా మహేష్ ఎక్కడా ఏ బహిరంగ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఎయిర్‌పోర్ట్‌లలో కనిపించడం తప్ప ఏ సినిమా వేడుకల్లోనూ మెరిసింది లేదు. అభిమానులు కూడా మహేష్‌ను బయట చూడటానికి చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో జయకృష్ణను ఆశీర్వదించడానికి మహేష్ వస్తాడనే ఊహాగానాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. అది పూర్తిగా దర్శకధీరుడు రాజమౌళి నిర్ణయం పైనే ఆధారపడి ఉంది.
ఒక్కసారి జక్కన్నతో సినిమా కమిట్ అయ్యాక, ఆయన అనుమతి లేకుండా ఏ హీరో కూడా బయట ప్రమోషన్లలో పాల్గొనడం దాదాపు అసాధ్యం. ఆ కట్టుదిట్టమైన ఫ్రేమ్‌వర్క్ ఎలా ఉంటుందో మహేష్‌కి కూడా బాగా తెలుసు. ప్రస్తుతం వారణాసి ప్రాజెక్ట్ మేజర్ షూటింగ్ పూర్తి చేసుకుని, కనెక్టింగ్ సీన్స్ తో పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్‌ల చిత్రీకరణలో ఉంది. ఈ బిజీ షెడ్యూల్ నడుమ మహేష్‌కి రాజమౌళి పర్మిషన్ ఇస్తారా..? అన్న కొడుకు ఈవెంట్ కోసం కొద్దిసేపు వెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ లభిస్తుందా అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ఒకవేళ జక్కన్న పర్మిషన్ ఇచ్చి మహేష్ గనుక ఈ ఈవెంట్‌కు వస్తే, అది శ్రీనివాస మంగాపురం సినిమాకి కొండంత బలాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్‌లో ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. జులై 30న విడుదల కానున్న ఈ చిత్రంతో జయకృష్ణ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో, బాబాయ్ సపోర్ట్ ఏ మేరకు దక్కుతుందో చూడాలి!