సుమంత్‌కు 4 ఏళ్ళు.. అఖిల్ 11 ఏళ్ళు! మరి నాగ్‌కుఎలా?
ABN , Publish Date - Jul 27 , 2026 | 03:33 PM
మొన్నటి దాకా హిట్టు ముఖం చూడని అఖిల్ కు 'లెనిన్' ఆ లోటు తీర్చింది.. నాగార్జున పుత్రోత్సాహంతో ఉన్నారు.. ఒకప్పుడు మేనల్లుడు సుమంత్ కు, ఇప్పుడు చిన్నకొడుకు అఖిల్ కు సక్సెస్ రావడం వెనుక నాగ్ కృషి ఎంతో ఉంది.. నాగ్ కూడా సక్సెస్ ట్రాక్ తప్పి కొన్నేళ్ళయింది.. మరి కింగ్ మునుపటిలా సాగేదెప్పుడో?
లెనిన్ (Lenin) మూవీ సక్సెస్ రూటులో సాగగానే ఒక్కసారిగా అక్కినేని అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీలో ఏయన్నార్ (Akkineni Nageswara Rao), ఆయన నటవారసుడు నాగార్జున (Nagarjuna) ఇద్దరూ ఆరంభంలోనే సక్సెస్ చూశారు. నాగ్ పెద్దబ్బాయ్ నాగచైతన్య (Naga Chaitanya) కూడా రెండో సినిమా ఏ మాయ చేశావేతో హిట్టు పట్టేశారు. అఖిల్ (Akhil Akkineni) హీరోగా ఎంట్రీ ఇచ్చి పదకొండేళ్ళయింది. 2015లో 'అఖిల్' మూవీతోనే అఖిల్ యంగ్ హీరోగా అడుగు పెట్టారు. ఆ తరువాత సక్సెస్ కోసం తగిన సబ్జెక్ట్స్ ఎంపిక చేసుకోవడం- కష్టపడి నటించడం- చేస్తూ వచ్చారు అఖిల్. 'అఖిల్' తరువాత వచ్చిన నాలుగు సినిమాలు సైతం ఏ మాత్రం మురిపించలేక పోయాయి.
ఈ యేడాది వచ్చిన 'లెనిన్'తోనే అఖిల్ ఆశించిన విజయం ఆయన దరి చేరింది. దాంతో ఫ్యాన్స్ భలేగా ఆనందిస్తున్నారు. ఏయన్నార్ ఫ్యామిలీకే చెందిన సుమంత్ కూడా అఖిల్ సక్సెస్ కు సంతోషిస్తున్నారు. ఇదే విషయాన్ని తన తాజా చిత్రం 'మహేంద్రగిరి వారాహి' ప్రెస్ మీట్ లోనూ సుమంత్ తెలిపారు. సుమంత్ తొలి హిట్ కోసం నాలుగేళ్ళ సమయం పడితే, అఖిల్ మొదటి విజయం కోసం పదకొండేళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ రెండు విజయాల వెనుక నాగార్జున కృషి ఎంతో ఉందని ఫ్యాన్స్ కూడా గుర్తు చేసుకుంటున్నారు.
ఇదిలాఉంటే.. ఏయన్నార్ పెద్ద కూతురు కొడుకు సుమంత్ (Sumanth). చిన్నప్పుడు తాతయ్య, మేనమావలతోనే ఎక్కువగా గడిపారు సుమంత్. ఆయనను హీరోగా పరిచయం చేస్తూ నాగార్జున 'ప్రేమకథ' నిర్మించారు. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆ సినిమా పరాజయం పాలయింది. ఆ తరువాత 'యువకుడు' సినిమానూ నాగ్ నిర్మించారు- అదీ అదే రూటులో సాగింది. తాతయ్య ఏయన్నార్ తో సుమంత్ నటించిన 'పెళ్ళిసంబంధం', మేనమామ నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకున్న 'స్నేహమంటే ఇదేరా' చిత్రాలు కూడా ఆకట్టుకోలేక పోయాయి.
ఆ సమయంలో సుమంత్ హీరోగా సూర్యకిరణ్ ను డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ నాగ్ 'సత్యం'మూవీ నిర్మించారు. ఈ సినిమాతోనే సుమంత్‌కు ఫస్ట్ సక్సెస్ లభించింది. మేనల్లుడిని హీరోగా నిలిపినట్టుగానే చిన్నకొడుకు అఖిల్ సక్సెస్ కోసం నాగ్ తపించారు. ఎట్టకేలకు 'లెనిన్'తో ఆ లోటు తీరింది. మరోవైపు ఆపై గోదావరి, మళ్లీ రావా వంటి క్లాసిక్ హిట్స్ ఖాతాలో వేసుకుని ఫ్యామిలీ హీరోగా స్థిర పడిన సుమంత్ ఇప్పటికే సీతా రామం గతేడాది అనగనగా సినిమాలతో మంచి హిట్స్ అందుకుని సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడు. ఈ కోవలోనే రానున్న నెల రోజుల్లో మహేంద్రగిరి వారాహి, న్యూటన్ థర్డ్ లా వంటి రెండు వైవిధ్యభరితమైన సినిమాలతో అరించేందుకు రెడీ అయ్యాడు.
అచ్చి వచ్చే ఆ రెండు నెలలు...
ఇక నాగ్ కూడా సరైన సక్సెస్ చూసి చాలా ఏళ్ళయింది. 'సోగ్గాడే చిన్నినాయనా' తరువాత పలు ఫ్లాపులు నాగ్ ను పలకరించాయి. ఆ పై తనయుడు నాగచైతన్యతో కలసి నటించిన 'బంగార్రాజు' బాగానే సాగింది. సోలో హీరోగా నాగ్ కు సరైన సక్సెస్ లేక చాలా ఏళ్ళయింది. దాంతో నాగ్ ఫ్యాన్స్ ఆయన రాబోయే నూరవ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఒకప్పుడు మేనల్లుడు సుమంత్ ను, ఇప్పుడు చిన్నబ్బాయ్ అఖిల్ ను సక్సెస్ ట్రాక్ పై నిలిపిన క్రెడిట్ నాగ్ దే. మరి అలాంటి నాగ్ తనకు తాను ఎప్పుడు సరైన సక్సెస్ సంపాదించుకుంటారన్నది ఇప్పుడు ప్రశ్న. ఇప్పటికే తండేల్‌తో నాగ చైతన్య, అనగనగాతో సుమంత్, లెనిన్‌తో అఖిల్ సక్సెస్ ట్రాక్ ఎక్కగా ఇప్పుడు అందరి చూపు నాగార్జున పైనే ఉంది.
ఖచ్చితంగా నాగార్జున నూరవ సినిమాగా ముస్తాబవుతోన్న సినిమాతో ఆయనకు మళ్ళీ మునుపటి వైభవం వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. నాగ్ నూరవ సినిమాకు 'లాటరీ కింగ్' అనే పేరు వినిపిస్తోంది. ఈ చిత్రానికి రా కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్‌లో కానీ, రాబోయే సంక్రాంతికి కానీ రిలీజవుతుందని వినిపిస్తోంది. నాగ్ కు డిసెంబర్ నెల అచ్చివచ్చిందనే చెప్పాలి- ఆ నెలలో వచ్చిన మన్మథుడు, మాస్ మూవీస్ బంపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక జనవరిలో 'సోగ్గాడే చిన్నినాయనా' నాగార్జునకు ఎంతో ఆనందం పంచింది. అందువల్ల డిసెంబర్, జనవరిలో నాగ్ నూరో సినిమా ఎప్పుడు వచ్చినా అలరిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. తన నూరవ చిత్రానికి కూడా నాగార్జునే నిర్మాత - మరి ఈ మూవీతో తనను తాను సక్సెస్ ట్రాక్ పై నిలుపుకుంటారేమో చూడాలి.