Chiranjeevi: పర్సంటేజీ విధానం.. మళ్లీ చిరంజీవిపైనే దృష్టంతా...

ABN , Publish Date - Jun 18 , 2026 | 07:36 PM

సినిమా థియేటర్లు రెంటల్‌ విధానం, పర్సంటేజీ విధానంపై ఎంతో కాలంగా వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే! పెద్ది సినిమా విడుదల సమయానికి ఈ సమస్య గాలివానలా మారి పరిష్కారం కోసం ఎగ్జిబిటర్లు అంతా చిరంజీవిని ఆశ్రయించారు.

సినిమా థియేటర్లు రెంటల్‌ విధానం, పర్సంటేజీ విధానంపై ఎంతో కాలంగా వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే! పెద్ది సినిమా విడుదల సమయానికి ఈ సమస్య గాలివానలా మారి పరిష్కారం కోసం ఎగ్జిబిటర్లు అంతా చిరంజీవిని (Chiranjeevi) ఆశ్రయించారు. దాంతో మెగాస్టార్‌ రంగంలోకి దిగాల్సి వచ్చింది. చిరంజీవితో ఎగ్జిబిటర్లు తమ సమస్య గురించి చర్చించారు. ఇండస్ట్రీలో భాగంగా ఉన్న అందరికీ పూర్తి న్యాయం జరిగేలా ఉండాలని చిరును కోరారు. ఈ మేరకు ఛాంబర్‌ ఓ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. అందరికీ మేలు జరిగేలా చూస్తానని వారంతా పూర్తి భరోసా ఇచ్చారు.

తాజాగా ‘పెద్ది’ నిర్మాత వెంకట సతీశ్‌ కిలారు చాంబర్‌కు రాసిన లేఖతో మరోసారి ఈ వివాదం పైకొచ్చేలా ఉంది. ‘పెద్ది’కి సంబంధించిన నిర్ణయాలను తాము లేకుండానే తీసుకున్నారని ఆ లేఖలో సతీశ్‌ పేర్కొన్నారు. ‘పెద్ది’ బిజినెస్‌ ముందుగానే పూర్తి కావడం, పంపిణీదారులతో ముందుగానే ఒక అంగీకారానికి రావడం వల్ల పర్సంటేజ్‌ విధానం తమ సినిమాకు వర్కవుట్‌ కాదని ఆయన లేఖలో పేర్కొన్నారు. తమపై అదనపు భారం మోపవద్దని కోరారు. దీంతో మరోసారి వివాదం వార్తల్లో నిలిచింది. పర్సంటేజ్‌ వివాదం మళ్లీ మొదటికొచ్చినట్లయింది. జూలై మొదటి వారానికి సింగిల్‌ స్క్రీన్స్ లో  పర్సంటేజీ విధానం అమల్లోకి వస్తుందా? రాదా? అనే విషయంపై చర్చ జరుగుతోంది. ఈ పర్సంటేజీ విధానాన్ని సమస్యకు పరిష్కారం చూపడం, దీనిని అమలు చేయడంలో చిరంజీవి పూర్తి బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారని ఎగ్జిబిటర్లు తమ నోట్‌లో కూడా పేర్కొన్నారు. ఈ సమస్య గురించి ఇప్పుడు ఎగ్జిబిటర్ల దృష్టి అంతా చిరంజీవి పైనే ఉంది. ఈ విషయంలో చిరు జోక్యం చేసుకుంటారా? లేదా అన్న చర్చ జరుగుతోంది. మరో పక్క ఛాంబర్‌ అధ్యక్షుడిగా ఉన్న డి సురేశ్‌బాబు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ కూడా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎగ్జిబిటర్ల సమస్యపై ఆయన ఎలా స్పందిస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది.


సబ్‌ కమిటీలో ఉన్న మెంబర్స్‌ ఈ సమస్యపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు. చిరంజీవి ముందు ఈ సమస్యను ఎలా ప్రజెంట్‌ చేస్తారు. జూలై మొదటి వారంలో దీనికి సంబంఽధించి చర్చ జరుగుతుందా? అందరికీ మంచి జరిగే పరిష్కారం దొరికుతుందా? లేదా అన్నది ఆసక్తిగా మారింది.
     

    

Updated Date - Jun 18 , 2026 | 07:38 PM