అకీరా.. ఏం చేస్తున్నావ్! పవన్ కల్యాణ్ పిల్లలతో.. ప్రధాని మోదీ సరదా సంభాషణ
ABN , Publish Date - May 11 , 2026 | 07:59 AM
ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పవన్‌ని ప్రధాని మోదీ ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు
'ఆరోగ్యాన్ని ఆశ్రద్ధ చేయవద్దు. ప్రజా జీవితంలో ఉన్నవారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీరు ప్రజలకు మరింత విస్తృతంగా సేవలు అందించాల్సిన అవసరం ఉంది. అలా చేయాలంటే ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి' అని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కు ప్రధాని మోదీ (Narendra Modi) సూచించారు. ఆదివారం మోదీ హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. మోదీకి పవన్, తన సతీమణి అన్నా, పిల్లలు అకీరా నందన్ (Akira Nandan), ఆద్య (Aadhya), పోలినా అంజని (Polena Anjana), మార్క్ శంకర్ (Mark Shankar Pawanovich) తో కలిసి సాదరంగా స్వాగతం పలికారు.
సైనస్ సమస్య కారణంగా ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో పవన్ ఆరోగ్యం, యోగక్షేమాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. పవన్ సతీమణి అన్నా కొణిదెల (Anna Lezhneva) తో మోదీ మాట్లాడుతూ.. కొన్ని రష్యన్ పదాలు పలికారు. పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ తాను రూపొందించిన హ్యాండ్ మేడ్ వెల్కమ్, థాంక్యూ కార్డులను మోదీకి అందించారు. మార్క్ శంకర్‌ను ప్రధాని దగ్గరకు తీసుకొని 'సింగపూర్‌లో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అని మేమంతా ఆందోళనపడ్డాం' అంటూ ఆప్యాయంగా మాట్లాడారు.
పవన్ పెద్ద కుమారుడు అకీరా నందన్‌తో మాట్లాడుతూ... ఏం చేస్తున్నావని అడిగారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నానని. అలాగే స్పోర్ట్స్ షూటింగ్ శిక్షణ పొందుతున్నానని అకీరా చెప్పాడు. పవన్ వైపు మోదీ చూస్తూ.. 'ఇంట్లో ఒక మార్షల్ ఆర్ట్స్ స్టార్ ఉన్నారు. నువ్వూ అటు వైపే వెళ్తున్నావా' అని చమత్కరించారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత హిందీ కవి రాంధారీ సింగ్ దినకర్ కవితను అకీరా వినిపించగా.. మోదీ అభినందించారు. పవన్ కుమార్తెలు ఆద్య, పోలినా అంజనితో ప్రధాని మాట్లాడుతూ.. వారి చదువు గురించి అడిగి తెలుసుకున్నారు. మొత్తంగా 20 నిమిషాలు పవన్ ఇంట్లో గడిపారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఏపీలకు సంబంధించిన రాజకీయ అంశాలపైనా వారు చర్చించినట్టు సమాచారం.