ఎన్టీఆర్-నీల్ మూవీలో అఖిల్.. అసలు నిజం ఏమిటంటే?

ABN , Publish Date - Feb 27 , 2026 | 10:49 PM

ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

dragon

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ‘కేజీయఫ్‌’, ‘సలార్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాలతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్, మాస్ హీరో ఎన్టీఆర్‌తో జతకట్టడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రశాంత్ నీల్ తనదైన మార్క్ యాక్షన్ శైలిలో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

ఇక చిత్ర యూనిట్ ఇటీవల జోర్డాన్‌లో ఒక భారీ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అక్కడ కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు చిత్ర బృందం సర్వం సిద్ధం చేస్తోంది. ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై ముఖ్యమైన ఘట్టాలను చిత్రీకరించనున్నారు.

అయితే, గత కొద్ది రోజులుగా ఈ సినిమాలో అక్కినేని అఖిల్ (AKHIL) ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపించాయి. ప్రశాంత్ నీల్‌తో అఖిల్‌కు ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఈ ప్రచారం విపరీతంగా ఊపందుకుంది. అఖిల్ ఈ భారీ ప్రాజెక్టులో భాగం కాబోతున్నాడనే వార్త అక్కినేని అభిమానులను కూడా ఆకట్టుకుంది. కానీ, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. అఖిల్ ‘డ్రాగన్’ చిత్రంలో నటించడం లేదని, ఇవన్నీ కేవలం పుకార్లేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రాజెక్టుపైనే పూర్తి దృష్టి పెట్టిన ప్రశాంత్ నీల్, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే వేసవి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన కొత్త విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. మరోవైపు అక్కినేని అఖిల్ తన తదుపరి చిత్రం ‘లెనిన్’ షూటింగ్ పనుల్లో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. దీనిని ఈ ఏడాది జూన్ నెలలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్రణాళికలు రచిస్తోంది.

కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ కూడా ఒక కీలక పాత్రలో మెరవనున్నారు. రవి బసూర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. మొత్తానికి ‘డ్రాగన్’ చిత్రంపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎన్టీఆర్ మార్క్ మాస్ యాక్షన్‌ను, ప్రశాంత్ నీల్ టేకింగ్‌ను వెండితెరపై చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజీ కాంబో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.

Updated Date - Feb 27 , 2026 | 10:49 PM