Cinema Music: ఏఐ ట్యూన్స్ కే జై కొడుతున్న జెన్ జీ 

ABN , Publish Date - Jun 01 , 2026 | 02:30 PM

'ఏఐ-ఎటాక్'తో మానవ జీవితాలు చెల్లాచెదురు అవుతాయట. మనుషుల కళలూ కరిగిపోతాయట. మనసుకు ప్రశాంతత కలిగించే మ్యూజిక్ ను కూడా 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' శాసించనుందట.

'ఏఐ-ఎటాక్'తో (AI Attack) మానవ జీవితాలు చెల్లాచెదురు అవుతాయట. మనుషుల కళలూ కరిగిపోతాయట. మనసుకు ప్రశాంతత కలిగించే మ్యూజిక్ ను కూడా 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' శాసించనుందట. మరి మానవమేధ ఏం చేయనుంది?

దెబ్బ పడనుందట...!

పంచామృత సమానమైన శ్రావ్యమైన గీతాలెన్నో వందల సంవత్సరాల నుంచీ మనలను అలరిస్తూ ఉన్నాయి. ఇక సినిమా వెలుగు చూసిన తరువాత మరెన్నో ప్రయోగాలతో సంగీతం సాగుతోంది. అయితే ఇప్పుడు 'ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్' మూవీ మ్యూజిక్ ను సైతం శాసించబోతోందని విశేషంగా వినిపిస్తోంది. ఎందుకంటే 'కృత్రిమ మేధ'తో పని తొందరగా పూర్తవుతుంది...  ఎక్కువ మంది మ్యూజిసియన్స్ కోసం వెయిట్ చేయాల్సిన పనిలేదు... చెకాచెక్ అంటూ ఇట్టే ఇచ్చిన అసైన్ మెంట్స్ పూర్తయిపోతాయి. అంతేకాదు కోరుకున్న రీతిలో అన్నీ అమర్చి మనకు కావలసిన ఔట్ పుట్ ఇస్తోంది ఏఐ. ఆ మధ్య  ఏఐతోనే 'లవ్ యూ' అనే కన్నడ మూవీ మొత్తం రూపొందింది. ఆ సినిమా జనం ముందుకు వచ్చాక అంతగా ఆకట్టుకోలేదనుకోండి- అయినా సినిమాను, సినిమా మ్యూజిక్ ను భవిష్యత్ లో ఏఐ దెబ్బ కొట్టనుందని విశేషంగా వినిపిస్తోంది.

ఆ రోజుల్లో అలా...


ఓ పాట రూపొందాలంటే సందర్భాన్ని వివరించే రచయిత, దర్శకులు కావాలి. దానిని ఆకళింపు చేసుకొని పదాలు పలికించే గీత రచయితలూ రావాలి. ఆపై సదరు పాటలకు అనువుగా బాణీలు కట్టే సంగీత దర్శకులు బయలు దేరాలి. మెట్లు పేర్చాక వినసొంపైన గాత్రాల నుండి పాటకు ప్రాణం పోయాలి. అందుకు గాయనీగాయకులు అవసరం. వారు పాడితే చాలదు- ఆ గానామృతాన్ని తగిన స్కేలుపై రికార్డ్ చేయాలి. అందుకు తగ్గ సౌండ్ ఇంజనీర్, అసిస్టెంట్స్ అవసరం- పాటకు తగ్గ వాయిద్యాలు వాయించే సంగీతకళాకారులు మరింత అవసరం. అందరికీ సరైన రికార్డింగ్ థియేటర్ ఇంకెంతో ముఖ్యం. ఆ తరువాత కదా నాణ్యమైన, శ్రావ్యమైన సంగీతం మన దరికి చేరేది. పాత రోజుల్లో సినిమా సంగీతం అలా రూపొందేది.

మరువరాని అంశం...

ఒకప్పుడు కవి హృదయానికి తగ్గట్టుగా బాణీలు కట్టేవారు సంగీత దర్శకులు. తరువాతి రోజుల్లో మ్యూజిక్ డైరెక్టర్స్ అందించే ట్యూన్స్ కు అనువుగా గీత రచయితలు పదాలు పేరుస్తూపోవడం మొదలయింది. దాంతోనే పాటల్లో ఆత్మలేదనే సాహిత్యాభిమానుల విమర్శలు ఊపందుకున్నాయి. అయినా ఎవరు ఖాతరు చేశారు? డైరెక్టర్ చెప్పిన సన్నివేశాలకు తమకు తోచిన ట్యూన్స్ పేరుస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్స్. దానికి తగ్గ పాటలు పలికించే ప్రయత్నంలో సాగుతున్నారు గీత రచయితలు. అయినా అమృతం కురిపించడానికే ఎందరో కవులు ప్రయత్నిస్తూ ఉండడం మరువరాని అంశం. కొన్ని దశాబ్దాలుగా ఈ తంతుతోనే మన సినిమా సంగీతం సాగుతోంది. ముఖ్యంగా పేరున్న సంగీత దర్శకులందరూ ఇదే పంథాలో పయనిస్తున్నారు.

ఏఐతో మక్కీకి మక్కీ...!


ఎందరో మధురగాయనీగాయకులు, సంగీత కళాకారులు, సంగీత దర్శకులు అమృతం కురిపించారు. ఆ పాటలు ఈ నాటికీ మనసులను సేదతీరుస్తున్నాయి.ఆ మహానుభావులు అందించిన మధురాన్ని మననం చేసుకుంటూ వారిని ఇప్పటికీ తలచుకుంటూనే ఉన్నాం. అయితే ఏఐ కారణంగా ఆ మధురాన్ని రీక్రియేట్ చేస్తున్నారు. అమరులైన మధురగాయనీగాయకుల గాత్రాలనూ యథాతథంగా రూపొందిస్తున్నారు. ఏది ఒరిజినల్- ఏది ఏఐ క్రియేషన్ అన్న తేడాను తెలుసుకోవడమే కష్టతరమై పోతోంది.ఇలా చేయడం నేరమంటూ ఎంతోమంది ప్రముఖ గాయనీగాయకులు, సంగీత దర్శకులు, గీతరచయితలు కోర్టును ఆశ్రయించారు. అయినా కృత్రిమ మేధతో ఆ నాటి మధురాన్ని రీక్రియేట్ చేయడం సాగుతోంది.

కొత్త రాగాలు...

కోర్టులు హెచ్చరించినా, కళాకారులు అన్యాయమని నినదించినా  సినిమా సంగీతాన్ని ఏఐ కబ్జా చేస్తోంది. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం ప్రతి రోజూ యాభై వేలకు పైగా ఏఐ జెనరేటెడ్ ట్రాక్స్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో అప్ లోడ్ అవుతూనే ఉన్నాయి. ఒకప్పుడు సంగీతాభిమానులు ప్రముఖ గాయనీగాయకుల గాత్రాలను ఎక్కడ విన్నా ఇట్టే కనిపెట్టేసేవారు. ఏఐ క్రియేట్ చేసిన 'రిప్లికాస్'ను వింటే ఏది ఒరిజినల్ ఏది, రీ-క్రియేషన్ అన్న తేడా చెప్పేవారు ఈ తరంలో లేరనే తెలుస్తోంది. ఏది ఒరిజినల్ అన్న అంశాన్ని తెలుసుకోవడానికి కూడా మళ్ళీ 'ఏఐ'నే ఆశ్రయించాల్సి వస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఒరిజినల్ లో ఉన్న సంగీతాన్ని మరింత మధురంగా మలచి ఏఐ రూపకల్పన చేస్తోంది. దాంతో నవతరం ఏఐ రూపొందించిన ట్రాక్స్ కే జై కొడుతున్నారు. మనిషి సమకూర్చినా, మెషీన్ అందించినా 'మధురం మధురమే కదా' అనీ జెన్జీ అంటోంది. అంటే రాబోయే రోజుల్లో సిట్యుయేషన్ కు తగ్గ పాత మెలోడీస్ ట్యూన్స్ కావాలి అనగానే 'ఏఐ' గుట్టలు గుట్టలుగా మన ముందు పేరుస్తుంది. వాటిలో ఓ మ్యూజిక్ డైరెక్టర్ ది కొంత, మరో సంగీత దర్శకునిది ఇంకొంత కలగలిపి ఓ కొత్త రకం ట్యూన్ ను అందిస్తోంది ఏఐ. పలు భాషల్లో ఈ  ప్రక్రియ ఊపందుకుందని తెలుస్తోంది... వాస్తవానికి ఇది సినిమా మ్యూజిక్ కు పెద్ద సవాలే అంటున్నారు పరిశీలకులు.

ధ్యానం... సాధనం...


ఏఐతో రీక్రియేషన్స్ చేసేవారు, సరికొత్తవి సృష్టించేందుకు తపిస్తున్నారు. కృత్రిమ మేధను ఉపయోగించినా, దానిని నడుపుతున్నది మనిషే కదా. అందునా సంగీతంతో కృత్రిమత్వం ఏదో ఒకరోజున పెద్ద దెబ్బ కొడుతుందని కొందరు భావిస్తున్నారు. ఏఐ మ్యూజిక్ లో ఆత్మ ఉండదని అంటున్నారు వారు.  'స్పందన' అన్నది మనిషికి దేవుడిచ్చిన వరమని, అది మెషీన్స్ కు ఉండదనీ గుర్తు చేస్తున్నారు. ఏఐ ఆధిపత్యాన్ని ఎదిరించాలంటే మనిషి ఇకపై మనస్పూర్తిగా పనిచేయవలసి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. ఉరుకుల పరుగులు తీస్తూ సాగితే, తప్పకుండా ఏఐ పై చేయి సాధిస్తుందనీ హెచ్చరిస్తున్నారు. ఏఐని అధిగమించాలంటే మరింత సృజన అవసరం. అందుకు ధ్యానం ఓ సాధనం కాగలదనీ కొందరు సూచిస్తున్నారు.ఈ సత్యాన్ని తెలుసుకొని మసలు కుంటే, మనుషులను వారి మనసులను కట్టిపడేసే సంగీతం రాకమానదు.

Updated Date - Jun 01 , 2026 | 02:33 PM