మళ్ళీ థియేటర్లలో పార్కింగ్ ఫీజు! ఇటీవలి ఉత్తర్వులు నిలిపివేత
ABN , Publish Date - Mar 19 , 2026 | 06:37 AM
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయరాదంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఈనెల 6న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను డివిజన్ బెంచ్ నిలిపివేసింది.
సింగిల్ స్క్రీన్ థియేటర్ల (Theaters)లో పార్కింగ్ ఫీజు (Parking Fee) వసూలు చేయరాదంటూ హైకోర్టు (High Court) సింగిల్ జడ్జి ఈనెల 6న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను డివిజన్ బెంచ్ నిలిపివేసింది. సదరు ఉత్తర్వులు పిటిషనర్ ప్రతివాదిగా చేర్చిన ఏషియన్ ముక్త ఏ2 కోణార్క్ (Asian Mukta A2 Cinemas Konark) అనే థియేటర్‌కు మాత్రమే వర్తిస్తాయని ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.
ప్రతివాదులుగా లేని ఇతర థియేటర్లకు సింగిల్ జడ్జి ఉత్తర్వులు వర్తింపజేస్తే యాజమాన్యాల హక్కులకు భంగం కలుగుతుందని పేర్కొంది. వాదనలు విన్న తర్వాత పార్కింగ్ ఫీజు వసూలుకు అనుమతి ఇస్తున్న జీవో 121 చట్టబద్ధతపై నిర్ణయం తీసుకోవాలని వెల్లడించింది.
ఈ మేరకు జీవో 121 చట్టబద్ధతపై సింగిల్ జడ్జి వద్ద తేల్చుకోవాలని పేర్కొంది. పార్కింగ్ పీజు వద్దన్న ఆదేశాల వల్ల ఇబ్బంది పడుతున్న థియేటర్ల యాజమాన్యాలు సింగిల్ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉన్న పిటిషన్ ఇంప్లీడ్ అయి వాదనలు వినిపించేందుకు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయొద్దన్న సింగిల్ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ నాచారంలోని ఆర్ఆర్ సినీ ఎంటర్ప్రైజెస్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ 35 ఎంఎం యాజమాన్యాలు హైకోర్టు డివిజన్ బెంచ్ లో పిటిషన్లు దాఖలు చేశాయి.
ఈ పిటిషన్లపై వాదనలు విన్న ధర్మాసనం.. జీవో చట్టబద్ధతపై సింగిల్ జడ్జి వద్ద తేల్చుకోవాలని పేర్కొంది. పార్కింగ్ పీజు వద్దన్న ఉత్తర్వులు పిటిషనర్ వద్ద పార్కింగ్ ఫీజు వసూలు చేసిన ఏషియన్ ముక్త కోణార్క్ థియేటర్‌కే వర్తిస్తాయని స్పష్టం చేస్తూ విచారణ ముగించింది.