SS Rajamouli: జక్కన్న నీ ఫ్లానింగ్ ఊహాతీతం.. చర్యలు వర్ణనాతీతం సామీ
ABN , Publish Date - Jul 16 , 2026 | 06:18 PM
వారణాసి తర్వాత రాజమౌళి సినిమా ఏమై ఉంటుందనే చర్చ నెట్టింట ఊపందుకుంది.
తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పాడు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli). ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలతో తెలుగు సినిమాను పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనకే దక్కుతుంది. ప్రస్తుతం జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ‘వారణాసి’ (Varanasi) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమార్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని రాజమౌళి పక్కా ప్లానింగ్‌తో దూసుకుపోతున్నారు. అయితే ‘వారణాసి’ తర్వాత ఆయన ఏ హీరోతో సినిమా చేయబోతున్నారనే ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు అన్ని చిత్ర పరిశ్రమల్లో జోరుగా సాగుతోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో దర్శకధీరుడు రాజమౌళి, సౌత్ స్టార్ హీరో సూర్య (Suriya) కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతుందనే వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. సూర్యతో ఒక భారీ ప్రాజెక్ట్ చేయడానికి రాజమౌళి కూడా మొగ్గు చూపుతున్నట్లు గట్టి ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ టాక్ నిజమైతే గనుక, ఇది ఇండియన్ సినిమాలోనే అత్యంత క్రేజీయెస్ట్ కాంబినేషన్లలో ఒకటిగా నిలవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఇద్దరు దిగ్గజాలు జత కడితే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
నిజానికి సూర్య-రాజమౌళి కాంబినేషన్‌పై ఇలాంటి వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా వీరి కలయికపై పలుమార్లు జోరుగా చర్చలు జరిగాయి. అప్పట్లో రాజమౌళి తెరకెక్కించిన ఇండస్ట్రీ హిట్ ‘మగధీర’ చిత్రం కోసం మొదట సూర్యను సంప్రదించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ క్రేజీ ప్రాజెక్ట్ అప్పట్లో కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపించినప్పటికీ, అవి అధికారికంగా ఎప్పుడూ ఖరారు కాలేదు. తాజాగా మరోసారి ఈ కాంబో తెరపైకి రావడంతో సూర్య అభిమానులు మస్త్ ఖుషీ అవుతున్నారు. అయితే, ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌పై రాజమౌళి లేదా సూర్య టీమ్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
మరోవైపు, సూర్య ఈ ఏడాది ‘కరుప్పు’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్నారు. వరుసపెట్టి క్రేజీ సినిమాలు ఒప్పుకుంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆగస్టులో థియేటర్లలో సందడి చేయనుంది. దీని తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌తో జతకట్టారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు ‘జై భీమ్’ చిత్ర దర్శకుడు టి.జి. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకుతున్నాయి. మరి మహేష్ బాబు సినిమా పూర్తయ్యాక రాజమౌళి-సూర్య కాంబినేషన్ లో సినిమా నిజంగానే వస్తుందేమో చూడాలి.