స‌మంత అయింది.. మ‌రి నెక్ట్స్‌ 'బంగారం' ఎవరు?

ABN , Publish Date - Oct 26 , 2026 | 05:00 PM

సమంత ‘మా ఇంటి బంగారం’ తర్వాత మహిళా ప్రాధాన్య సినిమాలపై ఆసక్తి పెరిగింది. రష్మిక మందన్న ‘మైసా’, నయనతార ‘మహాశక్తి’, ‘రాక్కాయి’, సంయుక్త మీనన్ ‘బ్లాక్ గోల్డ్’ చిత్రాలపై అంచనాలు పెరుగుతున్నాయి.

rashmika nayanthara

ఏ సినిమా అయినా సూపర్‌డూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంటే ఆ సినిమాకు పని చేసిన వారికి కచ్చితంగా ప్లస్‌ అవుతుంది. మరింత కష్టపడాలనే ఉత్సాహాన్నిస్తుంది. కానీ, ఫీమేల్‌ ఓరియంటెడ్‌ సినిమాల సక్సెస్‌ మాత్రం అంతకు మించి చేస్తాయని చెప్పాలి. ఆ తరహా సినిమాలను ప్లాన్‌ చేస్తున్నవారిని ప్రోత్సహిస్తాయి. మహిళా ప్రాధాన్యమున్న సినిమాల వైపు నాయికలను మొగ్గు చూపేలా చేస్తాయి. లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలకు ప్రేక్షకులను థియేటర్ల వైపు కాన్ఫిడెంట్‌గా నడిపిస్తాయి. మరి మన దగ్గర ఈ తరహా ట్రయల్స్‌లో ఉన్నవారెవరు? వాళ్ల ముందున్న టార్గెట్స్‌ ఏంటి?

డిస్టింక్షన్‌లో పాస్‌!

2026ని సమంత అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఎన్నాళ్లుగానో ఆమె ఎదురుచూస్తున్న సక్సెస్‌ని అందించింది ఈ ఏడాదే. ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram) మూవీతో బాక్సాఫీస్‌ దగ్గర వంద కోట్ల మార్క్‌ దాటి చూపించారు సామ్ (Samantha). చీరకట్టులో ఆమె ఫైటింగ్‌ చేస్తుంటే ఫిదా అయ్యారు అభిమానులు. ఓ వైపు ఫ్యామిలీ ఎమోషన్స్‌, ఇంకో వైపు ఇంట్రస్టింగ్ స్క్రీన్‌ ప్లేతో థియేటర్లలో రఫ్ఫాడించారు సమంత. అందుకే ఆ మూవీ ఈ ఇయర్‌లో ది బెస్ట్‌ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

ఇప్పుడు రష్మిక టర్న్‌

నార్త్‌, సౌత్‌ సినిమాలతో ఆ మధ్య యమా బిజీగా షటిల్‌ సర్వీస్‌ చేసిన రష్మిక మందన్న (Rashmika Mandanna) ఇప్పుడు కాస్త కూల్‌గా కనిపిస్తున్నారు. జయమ్మ పాత్రలో ఆమె నటించిన ‘రణబాలి’ (Ranabaali) ఇటీవల విడుదలైంది. ఫక్తు ఫీమేల్‌ ఓరియంటెడ్‌ మూవీ ‘మైసా’ (Mysaa) ముస్తాబవుతోంది. నవంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఫీమేల్‌ ఓరియంటెడ్‌ కంటెంట్‌ని జనాల్లోకి ఈజ్‌తో తీసుకెళ్లగలరనే పేరుంది రష్మికకు. ఇప్పుడు ‘మైసా’తో ఆ విషయం ఇంకోసారి ప్రూవ్‌ అయితే, ఆమెను దృష్టిలో పెట్టుకుని ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి బయోపిక్‌ తరహాలో మరిన్ని భారీ బడ్జెట్‌ కథలను కచ్చితంగా రాయొచ్చన్నది యంగ్‌ ఫిల్మ్‌మేకర్స్‌ మనసులో మాట.

లేడీ సూపర్‌స్టార్‌ ఏమంటారు?

మొన్న మొన్నటిదాకా మహిళా ప్రాధాన్యమున్న సినిమాలకు ఫస్ట్‌ ఛాయి్‌సగా కనిపించేవారు అనుష్క శెట్టి. ఆమె తర్వాత మేకర్స్‌లో కాన్ఫిడెన్స్‌ పెంచిన నటి నయనతార. లేడీ సూపర్‌స్టార్‌ అనే ట్యాగ్‌లైన్‌ని కూడా ఆమెకు ఈ తరహా చిత్రాలే తెచ్చిపెట్టాయి. ఓ వైపు స్టార్‌ హీరోలతో కమర్షియల్‌ సినిమాలు చేస్తూనే, మరోవైపు మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలకు సై అంటూనే ఉన్నారు నయన్ (Nayanthara). ఇప్పుడు ఆమె కెరీర్‌లో లైన్‌పలో ఉన్న ‘మహాశక్తి’ (Mahashakthi) ‘రాక్కాయి’ అలాంటి చిత్రాలే. ‘రాక్కాయి’ రిలీజ్‌ డేట్‌ ఇంకా ఫిక్స్‌ కాలేదు. ‘మహాశక్తి’ మాత్రం నవంబర్‌ 6న విడుదల కానుంది. ఈ రెండు సినిమాల కోసం మన వాళ్లే కాదు, తమిళ తంబిలు కూడా ఇష్టంగా ఎదురుచూస్తున్నారు.

వీరి కోవలోనే...

వీరిద్దరి కోవలోనే అడుగులు వేస్తున్నారు సంయుక్త మీనన్ (Samyuktha). కంటెంట్‌ ఉన్న కథలకు కేరాఫ్‌గా పేరుంది సంయుక్తకు. ఆమె నటిస్తున్న ‘బ్లాక్‌ గోల్డ్‌’ (Black Gold) కూడా ఫీమేల్‌ ఓరియంటెడ్‌ కంటెంట్‌ ఉన్న సినిమాల సక్సెస్‌ లిస్టులో చేరుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మేకర్స్‌. ఈ ఏడాది ఆల్రెడీ సక్సెస్‌ అయిన ‘మా ఇంటి బంగారం’ తరహాలో సక్సెస్‌ చూసే నెక్స్ట్‌ బంగారం ఎవరనే ఆసక్తి సర్వత్రా కనిపిస్తోంది. ‘మైసా’, ‘మహాశక్తి’ సక్సెస్‌లు జస్ట్‌ రష్మిక అండ్‌ నయన్‌కి మాత్రమే కాదు, ఆ తరహా సినిమాలతో క్యూలో ఉన్న మిగిలిన చిత్రాలకు బూస్టప్‌ ఇస్తాయన్నది ఇండస్ట్రీ మాట.

Updated Date - Oct 26 , 2026 | 05:46 PM