పెద్ది ఓకే.. వాట్ నెక్స్ట్ బుచ్చిబాబు
ABN , Publish Date - May 24 , 2026 | 09:40 AM
డెబ్యూ మూవీతోనే వంద కోట్ల క్లబ్‌లో చేరి, ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచాడు దర్శకుడు బుచ్చిబాబు సాన.
'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెడుతూనే సంచలన విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు బుచ్చిబాబు సాన (Buchi Babu Sana). డెబ్యూ మూవీతోనే వంద కోట్ల క్లబ్‌లో చేరి, ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచాడు. సాధారణంగా మొదటి సినిమాకే ఆ రేంజ్ సక్సెస్ వస్తే, ఏ దర్శకుడైనా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఓకే చేస్తూ దూసుకుపోతుంటారు. కానీ, బుచ్చిబాబు మాత్రం పూర్తిగా భిన్నమైన పంథాను ఎంచుకున్నాడు. తన రెండో సినిమా అయిన పెద్ది (Peddi Movie)ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆయన ఏకంగా ఐదేళ్ల సుదీర్ఘ సమయాన్ని తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో, ఇండస్ట్రీలో ఆయన చేయబోయే మూడో ప్రాజెక్ట్ గురించి అప్పుడే ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో రాబోయే 'పెద్ది' సినిమా ఫలితం బుచ్చిబాబు సినీ కెరీర్ కు అత్యంత కీలకంగా మారనుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా, పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధిస్తే, ఈ దర్శకుడి రేంజ్ పూర్తిగా మారిపోవడం ఖాయం. ఒకవేళ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తే, బుచ్చిబాబు తన తదుపరి చిత్రాన్ని కూడా ఇదే తరహాలో భారీగా ప్లాన్ చేయాలని అనుకోవడం సహజం. టాలీవుడ్‌లోని మరో స్టార్ హీరోతోనే తన మూడో సినిమాను సెట్ చేసుకోవాలని ఆయన బలంగా ఆకాంక్షిస్తాడు.
అయితే, ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే బుచ్చిబాబు ముందు ఒక పెద్ద సవాల్ కనిపిస్తోంది. ఇప్పుడు టాలీవుడ్‌లోని టాప్ స్టార్స్ ఎవరూ ఖాళీగా లేరు. ప్రతి ఒక్కరి కాల్ షీట్స్ రాబోయే రెండేళ్ల వరకు పూర్తిగా లాక్ అయిపోయాయి. రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్ వంటి క్రేజీ దర్శకులతో టాలీవుడ్ హీరోలంతా బిజీ షెడ్యూల్స్ తో గడుపుతున్నారు. ఇలాంటి తరుణంలో బుచ్చిబాబు ముందు కేవలం రెండు మార్గాలు మాత్రమే కనిపిస్తున్నాయి. పెద్ద హీరోల డేట్స్ దొరికే వరకు మరో రెండేళ్ల పాటు ఓపికగా నిరీక్షించడం. ఒకటి కాగా, కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇంత పెద్ద గ్యాప్ తీసుకోవడం కమర్షియల్ గా పెద్ద మైనస్ అవుతుంది. ప్రస్తుత జనరేషన్ లో ప్రేక్షకుల అభిరుచులు చాలా వేగంగా మారిపోతున్నాయి. అలాగని చిన్న హీరోతో సినిమా చేసి తన మార్కెట్ వాల్యూను తగ్గించుకోవడానికి కూడా ఆయన సిద్ధంగా లేడు.
ఒకవేళ టాలీవుడ్ లో అగ్ర హీరోల డేట్స్ దొరకని పక్షంలో, బుచ్చిబాబు కోలీవుడ్ వైపు అడుగులు వేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో తెలుగు దర్శకులు తమిళ స్టార్స్ తో జతకట్టి సినిమాలు చేయడం మంచి ట్రెండ్ గా మారింది. 'పెద్ది' కనక బ్లాక్ బస్టర్ హిట్ అయితే, కోలీవుడ్ లోని టాప్ హీరోలు సైతం బుచ్చిబాబుతో పని చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. సూర్య, కార్తి, లేదా శివకార్తికేయన్ వంటి క్రేజ్ ఉన్న హీరోలకు ఒక పక్కా విలేజ్ మాస్ కథను వినిపిస్తే ప్రాజెక్ట్ పట్టాలెక్కడం చాలా సులువవుతుంది. పైగా సౌత్ ఇండియా వ్యాప్తంగా మార్కెట్ ఉన్న హీరో దొరికితే బిజినెస్ పరంగా కూడా తిరుగుండదు. ఏదేమైనా, ఇప్పుడు చిత్ర పరిశ్రమ చూపులన్నీ 'పెద్ది' రిజల్ట్ పైనే ఉన్నాయి. ఆ సినిమా సాధించే బాక్సాఫీస్ ఫలితాన్ని బట్టే బుచ్చిబాబు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో తేలిపోనుంది.