రష్మిక.. వాట్ నెక్ట్స్! సినిమాలు.. వదిలేస్తుందా?
ABN , Publish Date - Mar 06 , 2026 | 07:55 AM
సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కెరీర్ అంటే అదొక రంగుల ప్రయాణం. ముఖ్యంగా పెళ్లి అనే మలుపు తర్వాత వారి ప్రయాణం ఎలా ఉండబోతుందనేది ఎప్పుడూ ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తుంది.
సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కెరీర్ అంటే అదొక రంగుల ప్రయాణం. ముఖ్యంగా పెళ్లి అనే మలుపు తర్వాత వారి ప్రయాణం ఎలా ఉండబోతుందనేది ఎప్పుడూ ఆసక్తికరమైన చర్చకు దారితీస్తుంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika) విషయంలో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది.
కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే తన మనసు గెలిచిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)ను పెళ్లాడి, ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అయితే, ఈ పెళ్లి ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌పై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? గతంలో మాదిరిగా రష్మిక జోరు కొనసాగుతుందా? లేక సెలెక్టివ్ సినిమాలతోనే సరిపెట్టుకుంటుందా?.
సాధారణంగా చిత్ర పరిశ్రమలో హీరోల కెరీర్‌తో పోలిస్తే హీరోయిన్ల ప్రయాణం కాస్త భిన్నంగానే ఉంటుంది. ఒక హీరో పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోగలరు. కానీ హీరోయిన్ల విషయంలో లెక్కలు మారుతుంటాయి. కెరీర్ ఆరంభంలో వరుస విజయాలు ఉంటే ఏడాదికి ఐదారు సినిమాలు చేసే వెసులుబాటు ఉంటుంది.
కానీ పెళ్లి అనే నిర్ణయం తీసుకున్న తర్వాత.. బాధ్యతలు పెరగడం వల్ల కావచ్చు లేదా ప్రాధాన్యతలు మారడం వల్ల కావచ్చు, వారు ఒప్పుకునే సినిమాల సంఖ్య తగ్గుతుంది. గతంలో ఎంతో మంది స్టార్ హీరోయిన్ల విషయంలో మనం ఇదే గమనించాం. ఇప్పుడు రష్మిక కూడా అదే బాటలో ప్రయాణిస్తుందా అనే సందేహాలు మొదలయ్యాయి.
పెళ్లికి ముందు రష్మిక టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు హిందీ పరిశ్రమలోనూ పాగా వేసింది. నిజానికి ఆమె బాలీవుడ్‌లోనే స్థిరపడాలని ఎన్నో ప్రణాళికలు వేసుకుంది. అయితే అక్కడ సినిమాల తీరు, పాత్రల స్వభావం మన దక్షిణాది సినిమాలకు భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా గ్లామర్ విషయంలో బాలీవుడ్ మేకర్స్ ఆలోచనలు వేరేలా ఉంటాయి. పెళ్లి తర్వాత గతంలో చేసినట్లుగా అతిగా గ్లామర్ ఒలికించే పాత్రలు చేయడానికి రష్మిక మొగ్గు చూపుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఒకవేళ ఆమె తన ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని పాత్రలను పరిమితం చేసుకుంటే, ఆమెకు గతంలో వచ్చినన్ని అవకాశాలు వస్తాయా? లేదా ఆమె పంథాను మార్చుకుని కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలకే పరిమితమవుతుందా? అన్నది చూడాలి. విజయ్ దేవరకొండను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో అభిమానుల్లో ఒకవైపు ఆనందం ఉన్నా, మరోవైపు ఆమె కెరీర్ పట్ల ఆందోళన కూడా ఉంది.
విజయ్ కూడా ఒక స్టార్ హీరో కావడంతో, ఇద్దరి ప్రొఫెషనల్ లైఫ్స్ బ్యాలెన్స్ చేయడం రష్మికకు సవాల్‌గా మారవచ్చు. టాలీవుడ్‌లో కంటే బాలీవుడ్‌లో పోటీ విపరీతంగా ఉంటుంది. అక్కడ నిలదొక్కు కోవాలంటే పూర్తి సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆమె తన పర్సనల్ లైఫ్‌కు ఎక్కువ సమయం ఇస్తే, బాలీవుడ్ అవకాశాలు చేజారిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు.
పెళ్లికి ముందు ఉన్న అదే ఉత్సాహాన్ని, వేగాన్ని రష్మిక తన సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ చూపిస్తుందని ఆమె అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఏదేమైనా, రష్మిక మందన్న ఇప్పుడు ఒక కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టింది. తన ప్రతిభతో ఎన్నో రికార్డులను తిరగరాసిన ఈ ముద్దుగుమ్మ, పెళ్లి తర్వాత కూడా తన సత్తా చాటుతుందని ఆశిద్దాం. ఆమె ఎంపిక చేసుకోబోయే తదుపరి చిత్రాలే రష్మిక ఫ్యూచర్ కెరీర్ ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తాయి.