మరోసారి.. రాజమౌళి- రామ్ చరణ్ కాంబో? ఫ్యాన్స్ హంగామా

ABN , Publish Date - Jun 19 , 2026 | 02:54 PM

'మగధీర', 'ఆర్ఆర్ఆర్' తర్వాత మరోసారి రాజమౌళి-రామ్ చరణ్ కాంబోలో సినిమా రానుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) 'చిరుత' సినిమాతో వెండితెరకు పరిచయమైనప్పటికీ, ఆయనను స్టార్ హీరోగా నిలబెట్టిన చిత్రం మాత్రం 'మగధీర' అనే చెప్పాలి. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో చరణ్ రెండో చిత్రంగా వచ్చిన ఈ మూవీ అప్పటివరకు టాలీవుడ్‌లో ఉన్న రికార్డులన్నింటినీ తుడిచేసి సరికొత్త చరిత్రను సృష్టించింది. 2009లో విడుదలైన ఈ విజువల్ వండర్ ప్రపంచవ్యాప్తంగా రూ.176 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి అప్పట్లో ఒక సంచలనంగా మారింది.

ఆ తర్వాత ఇదే క్రేజీ కాంబినేషన్ 'ఆర్ఆర్ఆర్' కోసం మళ్లీ చేతులు కలిపింది. ఈ భారీ మల్టీస్టారర్ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో ప్రధాన కథానాయకుడిగా నటించారు. ఆ సినిమా గ్లోబల్ స్థాయిలో తెలుగు సినిమా కీర్తిని పెంచడంతో పాటు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును సైతం టాలీవుడ్‌కు తీసుకువచ్చింది. ఇదిలా ఉంటే, మరోసారి రాజమౌళి-రామ్ చరణ్ కలయికలో మూవీ రానున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా 'వారణాసి' అనే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్యాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది. దాదాపు రూ. 1300 కోట్ల బడ్జెట్‌తో హాలీవుడ్ ప్రమాణాలతో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందోనని ఇటు అభిమానులు, అటు సినీ వర్గాలు ఎంతో ఆత్రుతగా వేచి చూస్తున్నాయి.

ఇక రామ్ చరణ్ తన తాజా చిత్రం 'పెద్ది' విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 400 కోట్ల కలెక్షన్లను రాబట్టి చరణ్ స్టామినాను మరోసారి నిరూపించింది. థియేటర్లలో విజయవంతంగా నడుస్తున్న ఈ సినిమాలో ఇటీవల కొన్ని అదనపు సీన్లను కూడా జోడించారు. ఈ క్రమంలో రానున్న రోజుల్లో ఈ చిత్రం మరిన్ని వసూళ్లను సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

'పెద్ది' తర్వాత చరణ్, సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ క్రేజీ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'రంగస్థలం' బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రేక్షకులకు సుపరిచితమే. ఆ మ్యాజిక్ ను మళ్లీ రిపీట్ చేయడానికి ఈ జోడీ సిద్ధమవుతోంది.

సుకుమార్ సినిమా తర్వాత రామ్ చరణ్- రాజమౌళి కాంబినేషన్‌లో మరో ప్రాజెక్ట్ ప్రారంభం కానుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'గరుడ'ను చరణ్ తోనే తెరకెక్కించబోతున్నారని, ఇలా ముచ్చటగా మూడోసారి ఈ కాంబో రిపీట్ కానుందని వార్తలు వస్తున్నాయి. కానీ, ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టమవుతోంది.

రాజమౌళి పూర్తి దృష్టి మహేష్ బాబు 'వారణాసి' పైనే ఉంది. ఆయన తన తదుపరి ప్రాజెక్ట్ ను ఇంకా ఖరారు చేయలేదు. 'ఆర్ఆర్ఆర్ 2' ఉంటుందని గతంలో ప్రకటించినప్పటికీ, అది పట్టాలెక్కాలంటే ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కాల్షీట్లు కూడా అవసరం అవుతాయి. కాబట్టి కేవలం రామ్ చరణ్ తోనే రాజమౌళి తదుపరి సినిమా ఉంటుందనే ప్రచారం ప్రస్తుతానికి కేవలం గాలివార్తే అని చెప్పాలి.

Updated Date - Jun 19 , 2026 | 03:06 PM