7 ఏళ్ళ నిరీక్షణ.. 2 ఏళ్ళ విరామం.. సమంత కమ్ బ్యాక్ అవుతుందా..?
ABN , Publish Date - Apr 23 , 2026 | 08:08 PM
ఓ బేబీ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసిన సమంత, ఆ తర్వాత మళ్ళీ ఆ స్థాయి విజయాన్ని అందుకోవడానికి ఏడేళ్లుగా నిరీక్షిస్తూనే ఉంది.
టాలీవుడ్ వెండితెరపై ఒక వెలుగు వెలిగిన వెన్నెల.. సమంత. తెరపై ఆమె కనిపిస్తే చాలు, ఆ సినిమాకి ఒక ప్రత్యేకమైన కళ వస్తుంది. కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా..! ప్రస్తుతం టాలీవుడ్ క్వీన్ సమంత (Samantha) కెరీర్ ఒక ఆసక్తికరమైన మలుపులో ఉంది. ఓ బేబీ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసిన సమంత, ఆ తర్వాత మళ్ళీ ఆ స్థాయి విజయాన్ని అందుకోవడానికి ఏడేళ్లుగా నిరీక్షిస్తూనే ఉంది.
నిజానికి ఓ బేబీ తర్వాత సమంత కెరీర్‌లో జాను, ఖుషీ వంటి సినిమాలు వచ్చాయి. అవి బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరుగా మెప్పించినా, సామ్ మార్క్ బ్లాక్ బస్టర్ రేంజ్‌ను మాత్రం తాకలేకపోయాయి. కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో తన సత్తా చాటాలని సామ్ గట్టిగానే ప్రయత్నించింది. కానీ, దురదృష్టవశాత్తూ ఆశించిన ఫలితాలు రాలేదు.
గడిచిన కొన్నేళ్లు సమంతకు కేవలం కెరీర్ పరంగానే కాకుండా, వ్యక్తిగతంగా కూడా పెద్ద పరీక్షలే పెట్టాయి. నాగచైతన్యతో విడాకుల తర్వాత ఆమె మానసికంగా ఎంతో వేదన అనుభవించింది. ఈ క్రమంలోనే మయోసైటిస్ వంటి ఆరోగ్య సమస్యలు ఆమెను చుట్టుముట్టాయి. షూటింగ్స్ కి దూరమవ్వాల్సి రావడం, శారీరకంగా ఇబ్బందులు పడటం ఆమె కెరీర్‌పై ప్రభావం చూపాయి. అయినా, ఆమె పట్టుదల మాత్రం తగ్గలేదు.
ఇక గతేడాది చివర్లో రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో పెళ్లిపీటలెక్కి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కెరీర్ పరంగా కూడా రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, సమంత ఇప్పుడు ఒక పక్కా ప్లాన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తనకు కెరీర్‌లో నందిని రెడ్డి (Nandini Reddy) అంటే ఒక ప్రత్యేకమైన నమ్మకం. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఓ బేబీ మంచి విజయాన్ని అందుకోవడంతో, ఇప్పుడు అదే కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతోంది. అయితే ఈసారి సమంత కేవలం హీరోయిన్ మాత్రమే కాదు.. నిర్మాత కూడా! తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై మా ఇంటి బంగారం సినిమాను రూపొందిస్తోంది.
మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram) అనే టైటిల్ వినగానే ఇదొక సాఫ్ట్ ఫ్యామిలీ డ్రామా అనిపిస్తుంది. కానీ, ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఇందులో సమంత రెండు విభిన్న కోణాల్లో కనిపించబోతోంది. ఒకవైపు మధ్యతరగతి మహిళగా సాఫ్ట్ లుక్ లో కనిపిస్తూనే, మరోవైపు ఊహించని యాక్షన్ మోడ్‌లో అదరగొట్టబోతోంది. ఇప్పటివరకు సామ్ చేయని ఒక సరికొత్త ప్రయోగం ఈ సినిమాలో ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
ఈ ఏడేళ్ల హిట్ నిరీక్షణకు, రెండేళ్ల కెరీర్ గ్యాప్‌కు మా ఇంటి బంగారం సరైన సమాధానం చెబుతుందని సమంత చాలా ఆశలు పెట్టుకుంది. కమర్షియల్ సక్సెస్‌తో పాటు, నటిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాలని ఆమె ఆరాటపడుతోంది. మే 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ బంగారం బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టి, సామ్ కెరీర్‌కు మళ్ళీ పూర్వవైభవాన్ని తీసుకొస్తుందా? సమంత మళ్ళీ తన సింహాసనాన్ని అధిష్టిస్తుందా? వేచి చూడాల్సిందే!