లిటిల్ హార్ట్స్ ద‌ర్శ‌కుడితో అడివి శేష్.. నిర్మాత ఎవ‌రంటే?

ABN , Publish Date - Apr 06 , 2026 | 06:06 PM

టాలీవుడ్‌లో స‌క్సెస్‌ఫుల్ హీరోగా దూసుకెళుతున్న వారిలో అడివి శేష్ ఒక‌రు. 'గూఢ‌చారి, ఎవ‌రు, మేజ‌ర్‌, హిట్ - ది సెకండ్ కేస్‌'.. ఇలా వ‌రుస విజ‌యాల‌తో

Adivi Sesh

టాలీవుడ్‌లో స‌క్సెస్‌ఫుల్ హీరోగా దూసుకెళుతున్న వారిలో అడివి శేష్ (Adivi Sesh) ఒక‌రు. 'గూఢ‌చారి, ఎవ‌రు, మేజ‌ర్‌, హిట్ - ది సెకండ్ కేస్‌'.. ఇలా వ‌రుస విజ‌యాల‌తో రేసులో దూసుకెళుతోన్న అడివి శేష్ నుంచి కొంత గ్యాప్ త‌ర్వాత రాబోతున్న చిత్రం 'డకాయిట్' (Dacoit). మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రం ఏప్రియ‌ల్ 10వ తేదీన విడుద‌ల‌య్యేందుకు ముస్తాబైంది. ఈ క్ర‌మంలో మూవీ ప్ర‌మోష‌న్స్‌ను మేక‌ర్స్ య‌మా జోరుగా నిర్వ‌హిస్తున్నారు. మ‌రోవైపు అడివి శేష్ చేస్తున్న 'గూఢ‌చారి' సీక్వెల్ 'గూఢ‌చారి 2' (G2) షూటింగ్ కూడా శ‌ర‌వేగంగా జరుపుకుంటోంది. ఈ రెండు సినిమాల‌పై ఇప్ప‌టికే మంచి అంచ‌నాలు, క్రేజ్ ఏర్ప‌డ్డాయి. ఈ రెండు సినిమాల త‌ర్వాత అడివి శేష్ చేయ‌బోయే సినిమాకు సంబంధించి ఓ వార్త వైర‌ల్ అవుతోంది. ఆ వివ‌రాల్లోకి వెళితే..

2025వ సంవ‌త్స‌రంలో చిన్న సినిమాగా వ‌చ్చిన 'లిటిల్ హార్ట్స్' (Little Hearts) చిత్రం ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాతో ద‌ర్శ‌కుడు సాయి మార్తాండ్ (Sai Marthand) త‌న స‌త్తా ఏంటో చాటారు. ఇప్పుడు సాయి మార్తాండ్ ద‌ర్శ‌క‌త్వంలో అడివి శేష్ హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకోనుంద‌ని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ న‌డుస్తోంద‌ని, త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని స‌మాచారం. అంతేకాదు, ఈ సినిమాను విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు, ఓ టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌తో క‌లిసి నిర్మించ‌నున్నార‌ట‌. స్క్రిప్ట్ ప‌నులు చివ‌రి ద‌శ‌లో ఉన్నాయ‌ని, త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని తెలుస్తోంది.

వాస్త‌వానికి 'లిటిల్ హార్ట్స్' చిత్రంలో రాజీవ్ క‌న‌కాల చేసిన పాత్ర‌కు మొద‌టిగా న‌న్నే సంప్ర‌దించార‌ని, ఆ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో జ‌గ‌ప‌తిబాబు (Jagapathi Babu) తెలిపారు. కానీ, వేరే ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండ‌టంతో, 'లిటిల్ హార్ట్స్‌'లో చేయ‌లేక‌పోయాన‌ని, క‌చ్చితంగా సాయి మార్తాండ్‌తో సినిమా చేస్తాన‌ని జ‌గ‌ప‌తిబాబు ఎంతో న‌మ్మ‌కంగా చెప్పారు. సినిమా చేస్తాన‌ని అన్నారు కానీ, ఇలా సినిమా నిర్మిస్తార‌ని మాత్రం ఎవ‌రూ ఊహించ‌లేదు. అందులోనూ జ‌గ‌ప‌తి బాబు నిర్మాత‌గా సినిమాలు చేయ‌డం ఎప్పుడో మానేశారు. చాలా కాలం త‌ర్వాత ఆయ‌న ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం మాత్రం ఊహించ‌ని ప‌రిణామ‌మే అని చెప్పుకోవాలి.

Updated Date - Apr 06 , 2026 | 06:13 PM