నగరంలో సీరియల్ కిల్లర్ వేట.. అదిరిపోయిన ఎస్‌ఐ యుగంధర్ ట్రైలర్
ABN , Publish Date - Sep 29 , 2026 | 05:46 PM
ఆది సాయికుమార్ శంబాల ఇచ్చిన హిట్ తో జోరు పెంచేశాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టి షాక్ ఇస్తున్నాడు. ప్రస్తుతం ఆది హీరోగా నటించిన చిత్రం ఎస్‌ఐ యుగంధర్.
ఆది సాయికుమార్ (Aadi Saikumar) శంబాల ఇచ్చిన హిట్ తో జోరు పెంచేశాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టి షాక్ ఇస్తున్నాడు. ప్రస్తుతం ఆది హీరోగా నటించిన చిత్రం ఎస్‌ఐ యుగంధర్ (Si Yugandhar). రాఘవేంద్ర కటారి దర్శకత్వంలో రూపొందిన ఈ ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ థ్రిల్లర్ లో ఆది సరసన మేఘలేఖ కథానాయికగా నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా మూవీ అఫీషియల్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. తొలి ఫ్రేమ్ నుంచే ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో సాగిన ఈ ట్రైలర్ సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
నగర శివార్లలో వరుసగా జరుగుతున్న ముగ్గురి దారుణ హత్యలతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఈ సీరియల్ కిల్లర్ కేసును ఛేదించడానికి సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్‌గా ఆది సాయికుమార్ రంగంలోకి దిగుతాడు. కిల్లర్ తీవ్రమైన నార్సిసిస్టిక్ బిహేవియర్, గాడ్ కాంప్లెక్స్ మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడని, అతను పోలీసులను తప్పుదోవ పట్టించడానికి పక్కా ప్రణాళికతో హత్యలు చేస్తాడని యుగంధర్ గుర్తిస్తాడు . డెడ్ బాడీలు 24 గంటల్లోనే మాయమవ్వడం, కేసు తీవ్రత పెరగడంతో ఉన్నతాధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతుంది. సైకో కిల్లర్ సైకాలజీని అర్థం చేసుకుంటూ ఈ కేసును ఛేదించడానికి యుగంధర్ ఏం చేశాడు.. ? ఎందుకు సైకో కిల్లర్ మనుషులను చంపుతున్నాడు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఎప్పుడూ బోర్ కొట్టవు. అందులో సైకో కిల్లర్ వర్సెస్ పోలీస్ అంటే సీట్ ఎడ్జ్ లో కూర్చోపెడతాయి. ఈ సినిమా కూడా అలాగే ఉండబోతుందని ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది. మార్కస్ ఎన్ అందించిన నేపథ్య సంగీతం థ్రిల్లింగ్ అనుభూతిని కలిగిస్తోంది. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, యాక్షన్ ఎలిమెంట్స్, సస్పెన్స్‌తో కూడిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది. ఎస్‌ఐ యుగంధర్ రూపంలో ఆది సాయికుమార్ మరో సాలిడ్ హిట్ ని అందుకుంటాడా .. ? లేదా.. ? అనేది తెలియాల్సి ఉంది.