బీజేపీలో చేరిన.. తెలుగు సినీ నటులు
ABN , Publish Date - May 07 , 2026 | 02:12 PM
సినిమా నటి రత్నమాల, సంగీత గురువారం బీజేపీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు సమక్షంలో వీరు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
తెలంగాణాలో బీజేపీ ప్రస్తుతం తృతీయ స్థానంలోనే ఉంది. అయితే సినిమా జనం నిదానంగా ఈ పార్టీ పట్ల ఆకర్షితులు అవుతున్నారు. ఇటీవలే సీనియర్ నటీమణి ఆమని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా సినిమా నటి రత్నమాల, సంగీత బీజేపీలో చేరారు. గురువారం బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వీరు భారతీయ జనతా పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి బిజెపి కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు తెలిపారు.
'ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంపై విశ్వాసంతో పార్టీలో చేరిన వారికి హృదయపూర్వక స్వాగతం. మాతృభూమి సేవలో వారు అంకితభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను' అని ఆయన అన్నారు.