Hide And Silk: మరో కొత్త కథతో సిద్దమైన సుహాస్.. ప్రోమో అదిరింది

ABN , Publish Date - Oct 12 , 2026 | 07:04 PM

టాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వర్సటైల్ యాక్టర్ సుహాస్ (Suhas). ఒక పక్క హీరోగా.. ఇంకోపక్క విలన్ గా నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు.

Hide & Silk

టాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వర్సటైల్ యాక్టర్ సుహాస్ (Suhas). ఒక పక్క హీరోగా.. ఇంకోపక్క విలన్ గా నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. ఇటీవలే మండాడి చిత్రంలో విలన్‌గా నటించి అందరినీ మెప్పించిన సుహాస్.. తాజాగా తన తదుపరి సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. సుహాస్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం హైడ్ & సిల్క్ (Hide & Silk). రాజేంద్ర బాలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లబ్బర్ పందు, డిసి ఫేమ్ సంజనా కృష్ణమూర్తి హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి సుహాస్ తండ్రి పాత్రలో కనిపించనున్నాడు.


క్యూట్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ ప్రోమోను మేకర్స్ గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ ప్రోమో ఆద్యంతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో సుహాస్ ఒక చేనేత కార్మికుడి పాత్రలో కనిపించనున్నాడు. తన జీవితంలో మొదటిసారి నేసిన చీరను ఏ అమ్మాయి ధరిస్తుందో, ఆ అమ్మాయికి తెలియకుండానే తనను చూడాలనుకునే ఓ ప్రత్యేకమైన యువకుడి కథతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్నట్లు ఈ ప్రోమో చూస్తే స్పష్టమవుతోంది.


ప్రతి చీర ఒక మహిళ కోసమే రూపుదిద్దుకుంటుంది అనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తెరకెక్కుతోంది. చేనేత కార్మికుల గురించి, వారి కష్టాల గురించి కూడా ఇందులో చూపించినట్లు సమాచారం. ఇక సంజన, సుహాస్ కాంబో చాలా ఫ్రెష్ గా కనిపిస్తోంది. అమృత్ రామ్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, స్టోన్ బెంచ్ స్టూడియోస్, మిస్రిలాల్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటివరకు వైవిధ్యమైన కథలతో మెప్పించిన సుహాస్, ఈ రొమాంటిక్ బాటలో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Oct 12 , 2026 | 07:09 PM