Siddharth: అందుకే నేను ఐటెంసాంగ్స్ చేయను..

ABN , Publish Date - Aug 21 , 2026 | 06:34 PM

బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, చిత్తా చిత్రాలతో టాలీవుడ్‌లోనూ, కోలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సిద్ధార్థ్ (Siddharth).

Siddharth

బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, చిత్తా చిత్రాలతో టాలీవుడ్‌లోనూ, కోలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సిద్ధార్థ్ (Siddharth). ఆయన నటుడిగా ఎంత ఫేమసో.. వివాదాల ద్వారా కూడా అంతే ఫేమస్. ఏది మాట్లాడిన ముక్కుసూటిగా మాట్లాడుతూ కాంట్రవర్సీ కింగ్ గా మారాడు. తాజాగా సిద్ధార్థ్ ఒక ఇంటర్వ్యూలో తను ఎంచుకునే పాత్రలు, సినిమాలు, తన నైతిక విలువలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సమాజానికి చెడు సందేశాన్ని ఇచ్చే ఎలాంటి పాత్రల్లోనూ తాను నటించనని ఆయన స్పష్టం చేశాడు.


సాధారణంగా ప్రతి సినిమాలో ఐటెంసాంగ్స్ చూస్తూనే ఉంటాం. కానీ సిద్దు సినిమాలలో ఐటెంసాంగ్స్ కనిపించవు. తాజాగా అలాంటి పాటలకు తాను ఎందుకు దూరంగా ఉంటాననే విషయంపై సిద్ధార్థ్ మాట్లాడుతూ.. "ఒక మహిళ చుట్టూ 40 మంది పురుషులు చేరి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే ఐటెం పాటల్లో నేను ఎప్పుడూ నటించలేదు, ఇకపై కూడా నటించను. మహిళలను తక్కువ చేసి చూపే ఎలాంటి సన్నివేశాలకు నేను మద్దతు ఇవ్వను" అని ఘాటుగా వ్యాఖ్యానించాడు.


అలాగే కేవలం హీరో పాత్రలే పోషించాలనే పట్టింపు తనకు లేదని, నటుడిగా వైవిధ్యమైన పాత్రలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. హీరో పాత్రలకు చెడు లక్షణాలు ఉండి, వారిని రోల్ మోడల్స్‌గా చూపే కథలను కూడా నేను ఎంచుకోను. సమాజానికి తప్పు సందేశం ఇవ్వడం నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. సినిమా చివరికి ఘోరంగా అంతమయ్యే నెగెటివ్ లేదా విలన్ పాత్రల్లో నటించడానికి కూడా నేను సిద్ధమే. కానీ చివరికి చెడు గెలిచేలా చూపించే పాత్రలను మాత్రం అంగీకరించను' అని సిద్ధార్థ్ స్పష్టం చేశాడు. సినీ పరిశ్రమలో కేవలం ఇమేజ్ కోసం కాకుండా బాధ్యతాయుతమైన కథలను ఎంచుకుంటానని చెప్పాడు. అయితే ఈ వ్యాఖ్యలపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు సిద్దును సమర్ధిస్తుంటే.. మరికొందరు రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకున్నప్పుడు మహిళని అవమానించినట్లు కాదా.. నీతులు చెప్పకు అని కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - Aug 21 , 2026 | 06:34 PM