Murali Mohan: చాటపర్రు నుంచి.. ప‌ద్మ‌శ్రీ స్థాయికి!

ABN , Publish Date - Jan 26 , 2026 | 05:57 AM

తెలుగు సినీ పరిశ్రమలో సౌమ్యుడిగా పేరుగాంచిన మురళీ మోహన్‌కు పద్మశ్రీ అవార్డు. ఆయన సినీ, నిర్మాణ, సేవా ప్రస్థానం పై పూర్తి వివరాలు.

Murali Mohan

తెలుగు చిత్ర పరిశ్రమలో సౌమ్యుడిగా పేరుగాంచిన సీనియర్‌ నటుడు, నిర్మాత మాగంటి మురళీ మోహన్ (Murali Mohan)ను ‘పద్మశ్రీ’ వరించింది. హీరోగా నట ప్రస్థానం ప్రారంభించి, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, నిర్మాతగా, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పరిశ్రమకు ఆయన అందించిన బహుముఖ సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం వరించింది.

1973లో ‘జగమే మాయ’ చిత్రంతో తెరంగేట్రం చేసిన మురళీ మోహన్‌, 350కు పైగా చిత్రాల్లో నటించారు. జయభేరి ఆర్ట్స్‌ పతాకంపై నాణ్యమైన చిత్రాలను నిర్మించారు. పరిశ్రమకు పెద్దగా, ఎందరో కళాకారులకు అండగా నిలిచారు. గతంలో రాజమండ్రి ఎంపీగా ఆయన సేవలందించారు.

పద్మశ్రీ పురస్కారం దక్కిన సందర్భంగా ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ‘నేను సినీ జీవితంలోకి ప్రవేశించి, 52 ఏళ్లు అవుతోంది. నా సేవలను గుర్తించి కేంద్రం పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేయడం ఆనందం కలిగించింది. చేతనైనంత వరకూ పేదలకు సాయం చేయాలనేదే నా ఆశయం’ అని చెప్పారు.


మురళీ మోహన్ అసలు పేరు మాగంటి రాజాబాబు. 1940 జూన్ 24న పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రులో జన్మించారు. కుటుంబ వ్యాపార పనుల నిమిత్తం మద్రాసుకు తరచూ వెళ్లే సమయంలో, ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ ‘మన’ సత్యం “నువ్వు హీరోలా ఉన్నావు. సినిమాల్లో ప్రయత్నించు” అన్న మాటలు, ఇచ్చిన‌ ప్రోత్సాహంతో ఆయన సినీ రంగం వైపు నడిచారు. 1973లో ‘జగమే మాయ’తో తెరంగేట్రం చేసిన మురళీ మోహన్, హీరో పాత్రలకే పరిమితం కాకుండా ప్రతి పాత్రకు న్యాయం చేస్తూ ముందుకు సాగారు. దాసరి నారాయణరావు, కె. రాఘవేంద్రరావు, క్రాంతికుమార్, విజయబాపినీడు వంటి దర్శకుల ప్రోత్సాహంతో విభిన్నమైన పాత్రల్లో ప్రేక్షకులను అలరించారు. 1978 సంవత్సరం ఆయన కెరీర్‌లో టర్నింగ్ పాయింట్. పెద్ద సినిమాల న‌డుమ‌, భారీ పోటీల మ‌ధ్య‌ ఆ ఏడాది విడుదలైన ‘పొట్టేలు పున్నమ్మ’ అంచనాలను మించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచి ప్రముఖ హీరోల సినిమాల మధ్య తనకంటూ ప్రత్యేక గుర్తింపును తీసుకువ‌చ్చింది.

ఆపై.. ‘జయభేరీ’ సంస్థ ద్వారా అనేక స్మరణీయ చిత్రాలు నిర్మించిన మురళీ మోహన్, నిర్మాతగా కూడా విజయాలను అందుకున్నారు. ఆయన 100వ చిత్రం ‘పిచ్చి పంతులు’ మంచి ఆద‌ర‌ణ‌ పొందింది. చివరగా నిర్మించిన ‘అతడు’ థియేటర్లలో కాస్త నిరావ ప‌ర్చినా నేటికి టీవీ, ఓటీటీల‌ ద్వారా విశేష ఆదరణ పొందుతూనే ఉంది. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన 2014లో రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. ఇవేగాక.. మ‌ధ్య‌లో అవార్డులు, సినిమా కార్యక్రమాల నిర్వహణలో కీలక పాత్ర పోషించడం, ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, ఆయన ఉత్సాహం మాత్రం ఇంకా తగ్గలేదు. త్వ‌ర‌లో 86వ ఓడిలోకి అడుగుపెడుతున్న మురళీ మోహన్, ఇప్పటికీ చురుగ్గా ఉండి, మంచి పాత్రలు దొరికితే నటించేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు, చదువు కోసం పోరాడుతున్న నిరుపేద విద్యార్థులకు చేయూతనిస్తున్నారు.

Updated Date - Jan 26 , 2026 | 05:57 AM