నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత.. 

ABN , Publish Date - Aug 27 , 2026 | 07:47 AM

ప్రముఖ నటుడు జీవీ నారాయణ రావు (73) కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

ప్రముఖ నటుడు జీవీ నారాయణ రావు (GV Narayanarao -73) కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని నటి కరాటే కల్యాణి సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. 100కు పైగా చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసిన నారాయణ రావు మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. 

చిన్ననాటి నుంచే కళలపై ఆసక్తి

కృష్ణా జిల్లా కురుమద్దాలి గ్రామంలో జన్మించిన జీవీ నారాయణ రావు బాల్యం, విద్యాభ్యాసం గుంతకల్లులో సాగింది. చిన్నతనం నుంచే కళలపై ఆసక్తి పెంచుకున్న ఆయన వివిధ కళల్లో శిక్షణ పొందారు. గిడుగు విశాలాక్షి వద్ద భరతనాట్యం, నటరాజ రామకృష్ణ వద్ద కూచిపూడి నృత్యం, ఎ.ఆర్. కృష్ణ వద్ద నటన నేర్చుకున్నారు. చదువుకునే రోజుల్లోనే ‘మహమ్మద్ బిన్ తుగ్లక్’, ‘ప్రతాపరుద్రీయం’, ‘మంచుతెర’ తదితర నాటకాల్లో నటించారు. ఆ సమయంలో కోట శ్రీనివాసరావు, నూతన ప్రసాద్, దేవదాస్ కనకాల వంటి ప్రముఖులు ఆయనకు రంగస్థల మిత్రులుగా ఉండేవారు.

GVN WIth Chiranjeevi

తొలి సినిమాతోనే నంది అవార్డు..

1976లో ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ తెరకెక్కించిన ‘అంతులేని కథ’ చిత్రంతో జీవీ నారాయణ రావు నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మద్రాస్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో నటనకు సంబంధించిన శిక్షణ పొందిన నారాయణ రావుకు రజనీకాంత్, చిరంజీవితో మంచి స్నేహబంధం ఉండేది. ‘అంతులేని కథ’, ‘ముత్యాల పల్లకి’, ‘అంగడి బొమ్మ’, ‘చిలకమ్మ చెప్పింది’,సీతారామయ్య గారి మనవరాలు, చట్టానికి కళ్లులేవు, రాజా విక్రమార్క, ‘గ్యాంగ్ లీడర్’, ‘హిట్లర్’, సాహసం, స్కైలాబ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆయన నటించిన చివరి చిత్రం 'ఆలోచన' విడుదల కావాల్సి ఉంది. 

GVN.png

నటుడిగానే కాదు.. నిర్మాతగానూ

జీవీ నారాయణ రావు కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగానూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ‘దేవాంతకుడు’, ‘ఇంటికో రుద్రమ్మ’, ‘యముడికి మొగుడు’, ‘పెళ్లినీకూ శుభం నాకు’ వంటి చిత్రాలను నిర్మించారు. వెండితెరతో పాటు బుల్లితెరపైనా తన నటనా ప్రయాణాన్ని కొనసాగించారు. పలు టీవీ సీరియళ్లలోనూ ఆయన కనిపించారు.

రంగస్థలం నుంచి కెరీర్ ప్రారంభించి.. సినిమాలు, టీవీ వరకు కొనసాగించిన జీవీ నారాయణ రావు ఇక లేరనే వార్తతో సినీ పరిశ్రమ  దిగ్భ్రాంతికి  గురయ్యింది.  ఆయన మృతిపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సంతాపం వ్యక్తం చేసింది.  

ALSO READ:

యాభై యేళ్ళ 'అంతులేని కథ' విశేషాలు... నటుడు నారాయణరావు మాటల్లో...


Updated Date - Aug 27 , 2026 | 08:41 AM