Ali: అవసరానికి వాడుకుని.. కరివేపాకులా తీసి పారేశారు..

ABN , Publish Date - Aug 09 , 2026 | 09:01 AM

నటుడు, మాజీ వైసీపీ నాయకుడు అలీకి (Ali) సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది,

నటుడు, మాజీ వైసీపీ నాయకుడు అలీకి (Ali) సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. 2019లో వైసీపీలో చేరిన ఆయనకు ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్‌ పదవి ఇచ్చారు. అయితే చేసిన సేవకు గుర్తింపు లేదని గ్రహించి 2024లో పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. పార్టీని వదిలేయడానికి గల కారణాలు చెబుతున్న ఓ వీడియో రెండ్రోజులుగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

 తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘నేను రాజకీయాల్లోకి రావాలనుకోలేదు. అనుకోని పరిస్థితుల్లో నన్ను తీసుకెళ్లారు. ఏదీ అశించకుండా వైసీపీలోకి వెళ్లాను. ఏదన్నా ఆశించి ఉంటే ఒకటి, రెండేళ్లల్లో బయటకు వచ్చేసేవాడిని. నా పని మానుకుని వెళ్లి ఎన్నికల సమయంలో ఆ పార్టీకి ఎంతగా ప్రచారం చేశానో జనాలకు తెలుసు. అక్కడ నాకు ఎలాంటి గుర్తింపు దక్కలేదు. ఐదేళ్లకోసారి వాడుకుని వదిలేస్తే ఏ మనిషికైనా ఎలా ఉంటుంది? బాధగా ఉంటుందా లేదా? నాకు అన్నం పెట్టింది సినిమా! రాజకీయం, ఏ రాజకీయ నాయకుడు కాదు. సినిమాల్లోనే కాకుండా బయట కూడా నాకు మంచి గుర్తింపే ఉంది. ఇంత పేరున్న నన్ను వాడుకుని, గుర్తింపు లేకుండా కరివేపాకులా తీసి పారేస్తే బాధ కలిగింది. అది అనుభవించాను కాబట్టే నాకెందుకు ఈ రాజకీయం అనుకున్నాను. నా పని నాకుందిగా అనిపించింది. ఈ రాజకీయాలు వద్దు అనుకుని నిర్ణయించుకుని బయటకు వచ్చేశా. అందుకే మళ్లీ నా పనిలోకి నేను వచ్చేశా’ అని అన్నారు.

Updated Date - Aug 09 , 2026 | 09:11 AM