Polimera 3: కొమరయ్యని మట్టుపెట్టడానికి వచ్చిన విరావి
ABN , Publish Date - Nov 09 , 2026 | 07:51 PM
తెలుగు చిత్రసీమలో మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీగా విశేష ప్రేక్షకాదరణ పొందిన పొలిమేర సిరీస్ నుంచి రాబోతున్న మూడో చిత్రం ‘పొలిమేర 3’ (Polimera 3) బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలను పెంచేస్తోంది.
తెలుగు చిత్రసీమలో మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీగా విశేష ప్రేక్షకాదరణ పొందిన పొలిమేర సిరీస్ నుంచి రాబోతున్న మూడో చిత్రం ‘పొలిమేర 3’ (Polimera 3) బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలను పెంచేస్తోంది. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ (Dr. Anil Vishwanath) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వంశీ నందిపాటి, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ (ఏషియన్ గ్రూప్)కు చెందిన భరత్ నారంగ్‌తో కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సత్యం రాజేశ్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందు మౌళి కీలక పాత్రల్లో నటించిన రెండు పార్టులు భారీ విజయాన్ని అందుకున్నాయి.
ఇక ఈ పొలిమేర 3 లో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాని యాడ్ చేసి మేకర్స్ ఇంకా హైప్ పెంచేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని అర్జున్ సర్జా పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.విరావి ఆమె పాత్రలో అర్జున్ కనిపించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఆయన లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. యోధుడి వేషధారణలో, చేతిలో కత్తితో ఆయన గంభీరమైన రూపం ప్రేక్షకులను తీవ్రంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇక ఈ గ్లింప్స్ లో ఆలయంలోని చీకటి ప్రదేశాలు, అమావాస్య వాతావరణం, విష్ణుమూర్తి నుంచి పరమశివుడికి మారే దృశ్యాలతో పాటు అనంత పద్మనాభస్వామి దర్శనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆధ్యాత్మికత, మిస్టరీ, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే పొలిమేర చీకటి ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్తూ ఈ గ్లింప్స్‌ను అత్యంత ఉత్కంఠభరితంగా మలిచారు. మొదటి రెండు భాగాలలో నిధి కోసం క్షుద్రపూజలు చేసి ఎంతోమందిని బలి ఇచ్చిన కొమరయ్యని మట్టుపెట్టడానికి విరావి వచ్చినట్లు చూపించారు. తొలుత ఓటీటీలో విడుదలై సంచలనం సృష్టించిన మా ఊరి పొలిమేర, ఆ తర్వాత థియేటర్లలో వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పొలిమేర 2 తరహాలోనే.. ఈ మూడో భాగం కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.