ఆదర్శకుటుంబం వాయిదా.. క్లారిటీ ఇచ్చిన నాగవంశీ
ABN , Publish Date - Sep 05 , 2026 | 06:48 PM
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ఆదర్శ కుటుంబం(AadarshaKutumbam). నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి క్లాసిక్స్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి.
విక్టరీ వెంకటేష్ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ఆదర్శ కుటుంబం(AadarshaKutumbam). నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి క్లాసిక్స్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర రాధాకృష్ణ (చిన్నబాబు), సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కుటుంబ కథా చిత్రాలకు పర్ఫెక్ట్ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ కాంబోలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఇక ఈ చిత్రంలో వెంకీ సరసన శ్రీనిధి శెట్టి నటిస్తోండగా.. నివేతా పేతురాజ్, నారా రోహిత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా విడుదల ఆలస్యం కావడంపై సోషల్ మీడియాలో రకరకాల రూమర్లు చక్కర్లు కొట్టాయి. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తీవ్ర విలంబన జరుగుతోందని, అందుకే సినిమా విడుదల బాగా ఆలస్యమవుతుందనే ప్రచారం జరిగింది. అంతేకాకుండా ఓటీటీ డీల్స్, డిజిటల్ రైట్స్ విషయంలో మేకర్స్ మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయని, దసరా రేసు నుంచి సినిమా పూర్తిగా తప్పుకుందంటూ పలు కథనాలు వైరల్ అయ్యాయి.అక్టోబర్ 2 కాకపోతే అక్టోబర్ 16 న ఈ సినిమా రానుందని కూడా రూమర్స్ వచ్చాయి. దీంతో విక్టరీ వెంకటేష్ అభిమానుల్లో కాస్త అయోమయం, ఆందోళన నెలకొన్నాయి.
ఈ రూమర్లన్నింటికీ స్వస్తి చెబుతూ నాగవంశీ తాజాగా సోషల్ మీడియా వేదికగా అధికారిక క్లారిటీ ఇచ్చాడు. సినిమా ఆలస్యమైనందుకు ప్రేక్షకులకు క్షమాపణలు తెలుపుతూనే, గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా రాబోయే ఒక నెల రోజులను AK47Month గా అభివర్ణిస్తూ ప్రమోషన్ల హోరును పెంచే ప్లాన్ వెల్లడించాడు. ఇందులో భాగంగా వచ్చే వారం ఆరంభంలో టీజర్, రెండో వారంలో మొదటి పాట, చివరి వారంలో బిగ్ థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు చెప్పుకొచ్చాడు. అలాగే ప్రతి వారం ఒక మ్యూజికల్ సర్‌ప్రైజ్‌తో అలరించబోతున్నట్లు ప్రకటించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మరి ఈ సినిమాతో వెంకీ- త్రివిక్రమ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.