మారిన రామ్ చరణ్ ట్యాగ్.. ఇక నుంచి గ్లోబల్ స్టార్ కాదు

ABN , Publish Date - Jun 26 , 2026 | 03:54 PM

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా (Buchibabu Sana) కాంబినేషన్‌లో వచ్చిన పెద్ది (Peddi) చిత్రం బాక్సాఫీస్ మంచి విజయాన్ని అందుకుంది.

Ram Charan

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా (Buchibabu Sana) కాంబినేషన్‌లో వచ్చిన పెద్ది (Peddi) చిత్రం బాక్సాఫీస్ మంచి విజయాన్ని అందుకుంది. రామ్ చరణ్ కెరీర్‌లోనే ఇదొక మైలురాయిగా నిలిచిపోవడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆయన కలెక్షన్ల స్టామినాను మరోసారి నిరూపించింది. ఈ భారీ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, ప్రముఖ నటులు బొమన్ ఇరానీ, జగపతిబాబు, దివ్యేందు శర్మ వంటి వారు కీలక పాత్రల్లో తమ అద్భుత నటనతో మెప్పించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లడంలో ప్రధాన పాత్ర పోషించాయి.


అయితే ఈ సినిమా విజయం కంటే ఎక్కువగా, రామ్ చరణ్ స్క్రీన్ ట్యాగ్‌లో వచ్చిన మార్పులు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. గేమ్ ఛేంజర్ సినిమా సమయంలో ఆయనకు గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్‌ను జోడించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ పాత మెగాపవర్ స్టార్ ట్యాగ్‌ను కొనసాగించినప్పటికీ, పెద్ది సినిమాతో మాత్రం ఒక సరికొత్త ట్రెండ్ మొదలైంది. ఆయనను ఇప్పుడు న్యూ ఏజ్ మెగాస్టార్ అని పిలవడం ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకుంటున్న చరణ్‌కు ఈ కొత్త బిరుదు పక్కాగా సరిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సరికొత్త ట్యాగ్ పట్ల స్వయంగా మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించి, తన ఆనందాన్ని వ్యక్తం చేయడం విశేషం. తండ్రి ఆశీస్సులు కూడా తోడవడంతో సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానులు న్యూ ఏజ్ మెగాస్టార్ అనే ట్యాగ్‌ను విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న మెగాపవర్ స్టార్ స్థానంలో ఇకపై రామ్ చరణ్ సినిమాలకు ఇదే స్క్రీన్ నేమ్‌గా కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే, రాబోయే రోజుల్లో ఆయన స్టార్‌డమ్ రేంజ్ మారబోతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


ఇక రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రంగస్థలం చిత్రం ఇండస్ట్రీ హిట్ సాధించడమే కాకుండా, చరణ్‌లోని నటుడిని సరికొత్తగా ఆవిష్కరించింది. ఇప్పుడు మళ్లీ సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న RC 17 ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దసరా నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కూడా రామ్ చరణ్ టైటిల్ కార్డ్స్ పై న్యూ ఏజ్ మెగాస్టార్ అనే ట్యాగ్ పడితే, థియేటర్లలో అభిమానుల ఇచ్చే కిక్, రచ్చ వేరే లెవెల్‌లో ఉంటుందని చెప్పవచ్చు.

Updated Date - Jun 26 , 2026 | 03:55 PM