పెద్ది.. స్పెషల్ సాంగ్! పెద్ద కథే.. నడిచిందిగా
ABN , Publish Date - Apr 16 , 2026 | 11:57 AM
పెద్ది చిత్రం వరుసగా వాయిదాలు పడుతూ వెళ్తుండడంతో మూవీపై చాలా అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా ఈ అనుమానాలకు మూవీ యూనిట్ చెక్ పెట్టారు.
త్రిబుల్ ఆర్ సినిమా తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) క్రేజ్ ఖండాంతరాలు దాటిపోయింది. కానీ ఆ తరువాత వచ్చిన రెండు సినిమాలు మెగా ఫ్యాన్స్‌ను మెప్పించలేకపోయాయి. ప్రస్తుతం మెగా అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్న సినిమా.. పెద్ది (Peddi). ఉప్పెన సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు సన (Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత నెల విడుదల కావాల్సిన ఈ చిత్రం వరుసగా వాయిదాలు పడుతూ వెళ్తుండడంతో మూవీ పై చాలా అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా ఈ అనుమానాలకు మూవీ యూనిట్ చెక్ పెట్టారు.
నిజానికి పెద్ది సినిమా ఈపాటికే థియేటర్లలో సందడి చేయాల్సింది. తొలుత మార్చి 27న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ పనుల్లో జాప్యం జరగడంతో అది ఏప్రిల్ 30కి.. ఆ తర్వాత జూన్ నెలకు వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఆలస్యంపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు రావడంతో రీసెంట్‌గా మూవీ యూనిట్ క్లారిటీ ఇచ్చింది. సినిమాకు సంబంధించి టాకీ పార్ట్ అంతా పూర్తయిందని.. కేవలం ఒక్కటంటే ఒక్క పాట మాత్రమే బ్యాలెన్స్ ఉందని వివరించారు.
ఈ ఒక్క పాట కోసం చిత్ర యూనిట్ గత నెల రోజులుగా తీవ్రంగా శ్రమిస్తోంది. ప్యాచ్ వర్క్ అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం.. జూన్ 25న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో అసలు సిసలు హైలైట్ స్పెషల్ సాంగ్. దీని కోసం హీరోయిన్ వెతుకులాట ఒక పట్టాన పూర్తి కాలేదు. మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), పూజా హెగ్డే (Pooja Hegde), మానసా వారణాసి (Manasa Varanasi), అయేషా ఖాన్ (Ayesha Khan) వంటి ముద్దుగుమ్మల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. మధ్యలో మృణాల్‌ను అడిగితే.. తనను ఎవరూ సంప్రదించలేదని చెప్పడంతో ఆశలు అడుగంటాయి.
కానీ లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. చిత్ర యూనిట్ మళ్ళీ మృణాల్‌నే కలిసి ఒప్పించిందట. టాలీవుడ్‌లో మృణాల్ అంటే ఇప్పటివరకు మనకు సీతా రామం, హాయ్ నాన్న లాంటి క్లాస్ పాత్రలే గుర్తొస్తాయి. కానీ రీసెంట్‌గా డెకాయిట్ సినిమాతో యాక్షన్‌లోనూ అమ్మడు బాగా అలరించడంతో మృణాల్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. దీనికి తోడు పెద్ది సినిమా పక్కా ఊర మాస్ సబ్జెక్ట్ కావడం.. ఇందులో ఆమెతో అదిరిపోయే మాస్ బీట్ చేయిస్తుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మృణాల్ గ్రేస్, చరణ్ స్పీడ్ తోడైతే థియేటర్లలో సీట్లు చిరగడం ఖాయమని స్పష్టంగా అర్థమవుతోంది.
ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్.. మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ (A R Rahman). ఆయన అందిస్తున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందని టాక్. ఇప్పటికే విడుదలైన టీజర్స్, పాటలకు సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మూవీ యూనిట్ కూడా అవుట్‌పుట్ విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. గ్యాప్ ఇచ్చినా హిట్ పక్కా అన్న రేంజ్‌లో చరణ్ బాక్సాఫీస్ వద్ద వేట మొదలుపెట్టబోతున్నాడు.