Tollywood: వైవిధ్యభరితమైన ఆరు చిత్రాలు!
ABN , Publish Date - Jun 17 , 2026 | 03:36 PM
గత వారం విడుదలైన సినిమాల్లో 'సింగ్ గీతం' ఒక్కటే కాస్తంత వైవిధ్యం ప్రదర్శించింది. ఈ వీకెండ్ లో ఆరు వరైటీ మూవీస్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతున్నాయి.
స్టార్ హీరోయిన్ సమంత తెర మీద కథానాయికగా కనికట్టు చేసి దాదాపు మూడేళ్ళు గడిచిపోయింది. ఆమె నటించిన చివరి చిత్రం 'ఖుషీ' 2023 సెప్టెంబర్ 1న వచ్చింది. గత ఏడాది వచ్చిన 'శుభం'లో సమంత కేవలం అతిథి పాత్రలోనే కనిపించారు. అభిమానుల దాహార్తిని తీర్చుతూ ఇప్పుడు సమంత 'మా ఇంటి బంగారం'గా రాబోతోంది. ఆమె భర్త రాజ్ నిడిమోరు కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాను నందినీరెడ్డి డైరెక్ట్ చేశారు. సంప్రదాయబద్ధమైన గృహిణిగానూ, ఫ్యామిలీని సేవ్ చేసే కోడలిగానూ సమంత రెండు భిన్నమైన పాత్రలను ఇందులో పోషించడం విశేషం. దాంతో సహజంగానే 'మా ఇంటి బంగారం'పై అంచనాలు నెలకొన్నాయి.
ప్రముఖ నిర్మాత వడ్డే రమేశ్ తనయుడు నవీన్ నిర్మాతగా కంటే... హీరోగానే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వైవిధ్యభరితమైన పాత్రలను పోషించిన నవీన్ చాలా గ్యాప్ తర్వాత 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' చిత్రంతో రీ-ఎంట్రీ ఇస్తున్నారు. రాశీసింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను కమల్ తేజ్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాతో తన పూర్వ వైభవాన్ని తిరిగి అందుకోగలననే ధీమాను వడ్డే నవీన్ వ్యక్తం చేస్తున్నారు. ఇదే శుక్రవారం హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన 'దీవానా' సినిమా విడుదల అవుతోంది. ప్రేమలోని ఇంటెన్సిటీని తెలియచేసే ఈ సినిమాను శ్రీకాంత్ సంగిశెట్టి తెరకెక్కించాడు. హార్డ్ హిట్టింగ్ మూవీస్ తెరకెక్కించిన సునీల్ కుమార్ రెడ్డి ఇప్పుడింకో ప్రయోగాత్మక చిత్రంతో జనం ముందుకొస్తున్నారు. ట్రాన్స్ జండర్స్‌తో పాటు ప్రముఖ నటీనటులు యాక్ట్ చేసిన కోర్ట్ రూమ్ డ్రామా 'ఎల్.జి.బి.టి. ఏ లీగల్ బ్యాటిల్' శుక్రవారం వస్తోంది.
మలయాళ చిత్రం 'మంజుమ్మెల్ బాయ్స్'తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు చిదంబరం. ఆయన రూపొందించిన తాజా చిత్రం 'బాలన్-ది బాయ్'. దీన్ని తెలుగు రాష్ట్రాలలో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ పంపిణీ చేస్తోంది. కాన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన 'బాలన్' మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడీ సినిమాను 19న ప్రధాన భారతీయ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు విజయ్ ఆంటోని - శశి కాంబోలో వచ్చిన 'బిచ్చగాడు' ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. మళ్ళీ ఇంతకాలానికి ఇప్పుడు వారిద్దరూ కలసి చేసిన 'వంద దేవుళ్ళు' సినిమా సైతం శుక్రవారం తెలుగులో విడుదల కాబోతోంది. అలానే గోపీచంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కించిన 'గౌతమ్ నంద' మూవీ శుక్రవారం రీ-రిలీజ్ కానుంది. మొత్తం మీద తెలుగు ప్రేక్షకులు కోరుకునే వైవిధ్యమైన కథా చిత్రాలు ఈ శుక్రవారం వస్తుండం విశేషం.
ఇవి కూడా చదవండి:
ఇండస్ట్రీని షేక్ చేసిన చికిరి చికిరి వీడియో సాంగ్ వచ్చేసిందిరోయ్
Bollywood: అప్పుడు సుశాంత్... ఇప్పుడు సంచిత!